Let's talk: editor@tmv.in
ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టుల వేగవంతం: మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టుల వేగవంతం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Gaddamidi Naveen
24 మే, 2026

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్‌గా మారుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఎన్ఐటీహెచ్ఎమ్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన “డెస్టినేషన్ తెలంగాణ – రోడ్ అహెడ్” పర్యాటక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రభుత్వ '99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పర్యాటక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ సదస్సు జరిగింది.

రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నూతన పర్యాటక పాలసీని తీసుకువచ్చిందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సరైన ప్రతిపాదనలు, డీపీఆర్ లతో వస్తే 'ఈజ్ ఆఫ్ డూయింగ్' కింద ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు, ప్రోత్సాహకాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పరిధిలో నిరర్థకంగా ఉన్న ఆస్తులను పర్యాటక అవసరాల కోసం దీర్ఘకాలిక లీజు పద్ధతిలో కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్' ప్రకటనలు జారీ చేస్తామని, ఎంపికైన సంస్థల డిజైన్లు, ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కొన్ని పర్యాటక ప్రాంతాలలో కనీస అవసరాలైన తాగునీరు, రెస్ట్ రూమ్స్, వసతి గృహాలు లేవని.. వీటిని అధిగమించేందుకు మొబైల్ గ్లాస్ హౌస్‌లు, కాన్వాస్ టెంట్లు వంటి ఆధునిక వసతుల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులు ముందుకు రావాలని మంత్రి కోరారు.

పర్యాటకం అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చే కీలక రంగమని మంత్రి పేర్కొన్నారు. పర్యాటక రంగం వృద్ధి చెందితేనే అనుబంధ పరిశ్రమలు లాభపడతాయని, తద్వారా యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటికే భువనగిరి కోటలో రోప్‌వే వంటి పర్యాటక ఆకర్షణలపై దృష్టి సారించామని వివరించారు. ఈ సదస్సులో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, టీజీటీడీసీ ప్రతినిధి పటుల్ రమేష్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.