
నరహరి రావు లాకర్లలో రూ.1.5 కోట్ల నగదు.. ఏసీబీ స్వాధీనం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేపట్టిన దర్యాప్తులో మరోసారి భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. శనివారం నిందితుడి భార్య పేరిట ఉన్న రెండు బ్యాంక్ లాకర్లను సోదాలు చేయగా.. రూ. 1.5 కోట్ల నగదుతో పాటు సుమారు రెండు కిలోల బంగారు బిస్కెట్లు, వజ్రాల ఆభరణాలు లభ్యమైనట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (మల్టీ జోన్-II) డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్. నరహరి రావుపై కేసు నమోదు చేసిన ఏసీబీ, జూన్ 16న ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి రూ. 13 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించింది. ఆ తర్వాత సదరు అధికారిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అధికారులు, శనివారం జరిపిన లాకర్ల తనిఖీల్లో ఈ అదనపు నగదు, బంగారం పట్టుబడ్డాయి. నిందితుడికి సంబంధించిన మరికొన్ని ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ తెలిపింది.
