
గర్భవిచ్ఛేదం మహిళ హక్కు: సుప్రీం కోర్టు
కాబోయే తల్లి పునరుత్పత్తి స్వేచ్ఛకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 28 వారాలకు పైబడిన గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవడానికి 15 ఏళ్ల బాలికకు అనుమతి ఇచ్చింది. న్యాయమూర్తులు బీవీ.నాగరత్న, ఉజ్జల్ భుయన్‌లతో కూడిన ధర్మాసనం, అనుకోని గర్భంతో ఉన్న మహిళలు కోర్టును ఆశ్రయించినప్పుడు నిషేధాత్మక వైఖరిని అవలంబించకూడదని పేర్కొంది. పుట్టబోయే బిడ్డ ప్రయోజనాల కంటే గర్భిణి మహిళ నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. అటువంటి గర్భాన్ని కొనసాగించడం వల్ల మైనర్ బాలిక మానసిక ఆరోగ్యం, విద్యా అవకాశాలు, సామాజిక స్థితి, భవిష్యత్ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు పడే అవకాశముందని పేర్కొంది. మహిళ పునరుత్పత్తి స్వేచ్ఛను అణచివేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని కోర్టు పేర్కొంది.
తన శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు, ముఖ్యంగా పునరుత్పత్తి విషయాలలో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతలో భాగమని స్పష్టం చేసింది. ఏ మహిళను, ముఖ్యంగా మైనర్ బాలికను, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని పూర్తి కాలం మోయమని బలవంతం చేయరాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలా చేయడం ఆమె నిర్ణయం తీసుకునే హక్కును హరించడమే కాకుండా, తీవ్రమైన మానసిక, భావోద్వేగ, శారీరక నష్టానికి దారితీస్తుందని హెచ్చరించింది. అలాగే, గర్భాన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయంలో గర్భిణి సంకల్పమే ముఖ్యం గాని, పుట్టబోయే శిశువు ప్రయోజనాలను మాత్రమే ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని పేర్కొంది.
అక్రమ గర్భస్రావ కేంద్రాలను ఆశ్రయిస్తే ప్రమాదమే
గర్భవతి బిడ్డను పెంచలేనప్పుడు దత్తతకు ఇవ్వొచ్చని చెప్పడం సులభం. కానీ అవాంఛిత గర్భం ఉన్న సందర్భాల్లో అది సరైన విధానం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిషేధాత్మక వైఖరి వల్ల గర్భస్రావాలు ఆగవని, అవి చట్ట విరుద్ధ మార్గాలకు మళ్లే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది.
అక్రమ గర్భస్రావ కేంద్రాలను ఆశ్రయించడం వల్ల మహిళల ప్రాణాలకు, ఆరోగ్యానికి ప్రమాదం పెరుగుతుందని తెలిపింది. చట్టపరమైన పరిమితులు ఉన్నప్పటికీ, ఇలాంటి క్లిష్ట కేసుల్లో న్యాయస్థానాలు వ్యక్తిగత హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. ఈ కేసులో బాలిక వయస్సు 15 సంవత్సరాలు ఉండడం, గర్భం అవాంఛనీయమైనది కావడం, అలాగే ఆమె ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని, గర్భవిచ్ఛేదానికి అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియను ఎయిమ్స్‌లో అత్యవసరంగా నిర్వహించాలని, అన్ని వైద్య భద్రతా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
