
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి: వైసీపీ
మహిళా నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్, రామచంద్రాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదని, దీనిపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ, మహిళా నాయకులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని నేతలు పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
