
మూడు కార్పొరేషన్ల పరిధిలో వైభవంగా ఆషాఢ బోనాలు.. రూ. 20 కోట్లు కేటాయింపు
తెలంగాణ ఆత్మను, సంస్కృతిని ప్రతిబింబించే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది మూడు కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి సురేఖ బుధవారం ‘జూమ్’ వేదికగా ఎంసిఆర్ హెచ్ఆర్ డిలో జరిగిన ఆషాఢ బోనాల ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సి.వి. ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బోనాల పండుగ కోసం రూ. 20 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఒకే కార్పొరేషన్ పరిధిలో జరిగిన ఈ ఉత్సవాలను, ఈసారి మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ఈసారి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల తాకిడి భారీగా ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలంకరణలు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.
