
ఆప్ ‘మాస్క్’ తొలగిపోయింది..డబ్బుకు రాజ్యసభ సీట్లు ఇచ్చింది: కాంగ్రెస్
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో విలీనమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆప్ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని, అది బీజేపీకి బీ-టీమ్‌గా పనిచేస్తోందని ఆరోపించింది. సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్‌మాకెన్ మీడియాతో మాట్లాడుతూ, ఆప్ పార్టీ రాజ్యసభ సీట్లను డబ్బు ఆధారంగా ధనికులకు ఇచ్చిందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ పేరు ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కాకుండా ‘అరబ్‌పతి ఆద్మీయోం కి పార్టీ (బిలియనీర్ల పార్టీ)’గా మార్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఆప్, బీజేపీకి బీ-టీమ్‌గా పని చేస్తోంది. పంజాబ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఆ పార్టీ ఉపయోగపడింది. ఇప్పుడు ఆ పార్టీ అసలు ముఖం బయటపడిందని అన్నారు. ఆప్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఏడుగురు ఎంపీల ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ, ఒక్కో ఎంపీ సగటు ఆస్తి విలువ రూ.818 కోట్లకు పైగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఖ్యలు చూస్తే ఆప్ సామాన్యుల పార్టీ కాదని స్పష్టమవుతోంది. ఇది ధనవంతుల పార్టీ అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 6 శాతం ఓట్లు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు బీజేపీతో ఉన్నారని ఆయన విమర్శించారు. మాకెన్ మరో ఆరోపణ చేస్తూ, పంజాబ్‌లో విభజన శక్తుల నుంచి ఆప్ నిధులు పొందిందని, ఆ పార్టీ దేశ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో భద్రతా పరంగా ఇది ఆందోళనకరమని పేర్కొన్నారు.
అలాగే, 2014లో ఢిల్లీలో ఆప్ 40 రోజుల ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ‘పెద్ద తప్పు’అని అంగీకరించారు. అదే కారణంగా ఆప్ ఢిల్లీలో బలపడిందని అన్నారు. ఇండియా కూటమి విషయంపై ప్రశ్నించగా ‘ఇది సమూహ నిర్ణయ ప్రక్రియ. ఇతర పార్టీల ఒత్తిడితో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది’ అని చెప్పారు. ఆప్ నాయకత్వం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వంటి నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని అన్నారు. బీజేపీ చేయలేని పనిని ఆప్ అనే ‘ప్రాక్సీ’ ద్వారా సాధించిందని ఆరోపించారు.
కమలం ‘లూటస్’ అయింది’
ఇక, ఈ విలీనంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఈ పరిణామం ఆశ్చర్యకరం కాదని అన్నారు. ఇటీవలి వరకు ఈ ఎంపీలపై బీజేపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు వారినే స్వాగతించడం రాజకీయ వ్యూహమని వ్యాఖ్యానించారు. ఇటీవలి వరకు ఈ ఎంపీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అవి ఆగిపోవచ్చని ఆరోపించారు. ఈ పరిణామాన్ని ఆయన ‘సర్జికల్ స్ట్రైక్’తో పాటు ప్రీ-ఎంప్టివ్ యాక్షన్‌గా అభివర్ణించారు. విపక్షాలు తరచుగా ఉపయోగించే ‘ఆపరేషన్ లోటస్’ పదాన్ని ప్రస్తావిస్తూ, బీజేపీ ఇతర పార్టీల నాయకులను ఆకర్షిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.
