
‘ఆప్’ తన విశ్వసనీయతను కోల్పోయింది: ఎన్. రామచందర్ రావు
ఆమ్ ఆద్మీ పార్టీ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని, ఆ పార్టీ ఇక కనుమరుగయ్యే దిశగా సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆదివారం విమర్శించారు. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం కావడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు.. లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా పాత్ర బయటపడిన తర్వాత 'ఆప్'కు ఉన్న నిజాయితీ అనే ముసుగు తొలగిపోయిందని అన్నారు. తమ పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని భావించే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇందులో అప్రజాస్వామికం ఏముంది? దేశ ప్రయోజనాల కోసం, ప్రజా హితం కోసమే వారు బీజేపీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. చట్టప్రకారం.. ఎన్నికైన సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఇతర పార్టీలో చేరితే లేదా విలీనం అయితే, వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని రామచందర్ రావు గుర్తుచేశారు. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్ నివాసాల వద్ద ఆప్ కార్యకర్తలు నిర్వహిస్తున్న నిరసనలు ఆ పార్టీ యొక్క అసహనానికి, ఫ్రస్ట్రేషన్‌కు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవైపు, ఆప్ నుంచి నిష్క్రమించిన ఎంపీ రాఘవ్ చద్దా శనివారం మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తన మూల సిద్ధాంతాల నుంచి దారి తప్పిందని ఆరోపించారు. అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిన పార్టీలో నిజాయితీపరులకు చోటు లేదు. అందుకే అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కల్పించిన అధికారంతో మేము ఏడుగురు ఎంపీలం కలిసి పార్టీని వీడుతున్నాం అని ఆయన వివరించారు. ఢిల్లీలో అధికారం కోల్పోయి, పంజాబ్‌లో పట్టు కోల్పోతున్న తరుణంలో ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి రాజీనామా ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
