
తిరుపతి జిల్లాలో ఘోర విషాదం: భార్య, తల్లిని చంపి..ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య
తిరుపతి జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. కన్నతల్లిని, కట్టుకున్న భార్యను కడతేర్చిన ఓ వ్యక్తి.. ఆపై తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటకృష్ణాపాలెం గ్రామానికి చెందిన మోహన్ (37) అనే వ్యక్తి చేసిన ఈ ఘాతుకం స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పుత్తూరు డీఎస్పీ జి. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మోహన్ మొదట తన ఇంట్లో భార్య హరిత (35)ను చీరతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అడ్డువచ్చిన తన తల్లి చంద్రకళ (65)ను కూడా అదే పద్ధతిలో అంతమొందించాడు. సాధారణంగా శాంతస్వభావిగా పేరున్న మోహన్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారి ఇలా ఎందుకు ప్రవర్తించాడనేది అంతుచిక్కడం లేదు. ఇటీవలే ఆయన సిమెంట్ వ్యాపారం ప్రారంభించినట్లు సమాచారం.
ఇంట్లో ఇద్దరిని హతమార్చిన తర్వాత మోహన్ నేరుగా తన పిల్లల పాఠశాలకు వెళ్ళాడు. ఇంట్లో ఎమర్జెన్సీ ఉందని పాఠశాల సిబ్బందిని నమ్మించి తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. తండ్రి తనను ఇంటికి తీసుకెళ్తున్నాడని భావించిన ఆ చిన్నారులు అదే తన చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయారు.
ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 7:15 గంటల ప్రాంతంలో వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఈగ్మోర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ వస్తుండగా మోహన్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పట్టాలపైకి దూకాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లోకో పైలట్ సమాచారం అందించడంతో రైల్వే పోలీసులు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దారుణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మోహన్‌కు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేక మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై హత్య కేసుతో పాటు రైల్వే ట్రాక్‌పై మరణాలపై గవర్నమెంట్ రైల్వే పోలీస్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేస్తోంది.
