Let's talk: editor@tmv.in
సింహాచలంలో కన్నులపండువగా చందనోత్సవం.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అనిత

సింహాచలంలో కన్నులపండువగా చందనోత్సవం.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అనిత

Panthagani Anusha
21 ఏప్రిల్, 2026

విశాఖ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే స్వామివారి నిజరూప దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అనిత వంగలపూడి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు

ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఈ పుణ్యకార్యాన్ని భాగ్యంగా భావిస్తున్నానని తెలిపారు. అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో మంత్రి నేరుగా మాట్లాడి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేగవంతమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

స్లాట్ విధానంతో సాఫీగా దర్శనాలు

వారసత్వ ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికారులు ప్రవేశపెట్టిన స్లాట్ విధానం సత్ఫలితాలను ఇచ్చింది. ఎక్కడా ఎటువంటి తోపులాటలు, అంతరాయం లేకుండా క్యూలైన్లు క్రమపద్ధతిలో కదిలాయి.

సమన్వయంతో పరిపాలన యంత్రాంగం

అత్యంత రద్దీ ఉండే చందనోత్సవం రోజున భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం దేవస్థాన అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేశారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్లు, క్యూలైన్లలో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

సింహాచలంలో కన్నులపండువగా చందనోత్సవం.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అనిత - Tholi Paluku