
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి
మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం వెళ్తున్న భక్తుల ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కర్నూలు జిల్లాలోని చిలకల డోన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోగా మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. జాతీయ రహదారి 167 పై చిలకలడోన గ్రామ సమీపంలో ఈ పెను విషాదం సంభవించింది. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు నుంచి బొలెరో వాహనంలో సుమారు 20 మంది భక్తులు మంత్రాలయానికి బయలుదేరగా గమ్యస్థానానికి చేరువలో మృత్యువు కబళించింది..
నిద్రమత్తు.. ప్రాణాల మీదకు తెచ్చిన అశ్రద్ధ
పోలీసుల కథనం ప్రకారం గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భక్తుల వాహనం చిలకలడోన సమీపానికి చేరుకుంది. ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రాంగ్ రూట్ లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ ట్యాంకర్ లారీని వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బొలెరో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ భీభత్సమైన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సామర్థ్యానికి మించి భక్తులు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు తెలుస్తోంది. కాగా స్థానికులు, పోలీసులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి, వాహన ఇనుప భాగాలను కోసి క్షతగాత్రులను బయటకు తీశారు. కాగా గాయపడిన 12 మందిని వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు జిజిహెచ్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ కొందరు మృత్యువుతో పోరాడుతున్నారు.
ప్రధాని, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
ఈ విషాద ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కన్నీరుమున్నీరవుతున్న బాధితుల కుటుంబాలు
మృతులంతా కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం కోసం వెళ్లిన తమ వారు విగతజీవులుగా తిరిగి వస్తుండటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు డ్రైవర్ అలసట, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించాం" అని ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్. భార్గవి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
