
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద జాతీయ రహదారిపై అతివేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న సైన్‌బోర్డుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
వైద్యం కోసం వెళ్లొస్తుండగా..
పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన చాపర్ల హనుమంతరావు, డి. సాగర్, చాపర్ల రాజు, గన్నిన నరేంద్ర కలిసి చెన్నై వెళ్లారు. దివ్యాంగుడైన హనుమంతరావుకు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని, తిరిగి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతపల్లి టోల్‌ప్లాజా సమీపంలో 500 మీటర్ల దూరంలో ఉన్న హెచ్చరిక బోర్డును కారు అతివేగంగా ఢీకొట్టింది.
డీకొట్టిన వేగానికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న హనుమంతరావు, సాగర్, రాజులు తీవ్ర రక్తస్రావమై స్పాట్‌లోనే మృతి చెందారు. వెనుక సీట్లో ఉన్న గన్నిన నరేంద్ర తీవ్రంగా గాయపడటంతో, పోలీసులు హైవే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
