
రణథంబోర్‌లో అరుదైన ఘట్టం.. ఒకే ఫ్రేమ్‌లో టైగర్, చిరుత, చీతా
రాజస్థాన్‌లోని రణథంబోర్ టైగర్ రిజర్వ్‌లో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలో అత్యంత వేగమైన, చురుకుగా ఉండే మూడు మృగాలు టైగర్, లియోపర్డ్ (చిరుత), చీతా — ఒకేసారి ఒకే ప్రాంతంలో కనిపించడం సంచలనం సృష్టించింది. ఈ అసాధారణ దృశ్యం ఆదివారం రణథంబోర్ రిజర్వ్‌లోని జోన్-9లో, చకల్ నది తీర ప్రాంతంలో దర్శనమిచ్చింది. ఈ మూడు మృగాలు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒకేసారి కనిపించడం పర్యాటకులను ఆశ్చర్యపరిచింది.
అటవీ శాఖ అధికారులు ఈ ఘటనను ‘చాలా అరుదైనది, శాస్త్రీయంగా ఆసక్తికరమైనది’గా పేర్కొన్నారు. రణథంబోర్ డిప్యూటీ కన్జర్వేటర్ మానస్ సింగ్ మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు ముందుగా ప్లాన్ చేయలేమని, ప్రకృతి అప్పుడప్పుడు ఇలాంటి ఆశ్చర్యాలను చూపిస్తుందని అన్నారు. ఈ ఘటనలో కనిపించిన చీతా ‘కేపీ-2’గా గుర్తించారు. ఇది మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి వలస వచ్చిందిగా అధికారులు తెలిపారు. గత వారం రాజస్థాన్‌లోకి ప్రవేశించిన ఈ చీతా, ప్రస్తుతం రణథంబోర్‌లో సంచరిస్తోందని, దాని కదలికలను ప్రత్యేక బృందం ట్రాక్ చేస్తోందని చెప్పారు.
వన్యప్రాణి నిపుణుల ప్రకారం, ఈ మూడు మృగాల జీవనశైలి, వేట విధానాలు, నివాస ప్రాంతాలు భిన్నంగా ఉంటాయి. టైగర్ విస్తృత పరిధిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తే, లియోపర్డ్ సాధారణంగా టైగర్‌ను తప్పించుకుంటూ అడవుల్లో దాగి ఉంటుంది. చీతా మాత్రం విస్తృతమైన గడ్డి మైదానాల్లో వేగంగా వేటాడుతుంది.
నిపుణుల ప్రకారం ఇది ‘నిచ్ పార్టిషనింగ్’అనే ప్రక్రియ వల్ల సాధారణంగా ఇవి ఒకదానితో ఒకటి పోటీ పడకుండా వేర్వేరు ప్రదేశాలు, సమయాలు ఎంచుకుంటాయి. కానీ ఈసారి ఆహారం కోసం వలసలు లేదా ఇతర పర్యావరణ కారణాల వల్ల తాత్కాలికంగా ఒకే ప్రాంతంలో చేరి ఉండవచ్చని భావిస్తున్నారు. సుమారు 1,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న రణథంబోర్ టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం సుమారు 70 టైగర్లు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది.
