
దేశ గమనాన్ని మార్చిన పరివర్తన కాలం: ప్రధాని మోడీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
భారతదేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ, దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా చారిత్రాత్మక రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని సామాన్య పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం నుంచి అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచడం వరకు అన్ని స్థాయిలలో దేశ రూపురేఖలను మార్చివేసిందని వారు కొనియాడారు.
2026 జూన్ 10 నాటికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీనితో ఇప్పటివరకు భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును మోడీ అధిగమించి, దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ‘ఎన్నికైన ప్రధాని’గా సరికొత్త మైలురాయిని చేరుకున్నారు.
ఇది కేవలం రికార్డు కాదు, పరివర్తన కాలం: సీఎం చంద్రబాబు
ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. మేము దీనిని కేవలం ఒక రికార్డుగా మాత్రమే చూడటం లేదు; దేశంలోని ప్రతి మూలను తాకిన, దేశ గమనాన్నే మార్చిన ఒక గొప్ప పరివర్తన కాలంగా దీనిని వేడుక చేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రధాని మోడీ నాయకత్వం కృషి చేసిందని సీఎం గుర్తుచేశారు. సామాన్యుల సంక్షేమ పథకాల నుంచి సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనలు, వ్యవసాయం జాతీయ భద్రత వరకు అన్ని రంగాలలో భారతదేశ సామర్థ్యం పెరిగిందన్నారు. మోడీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో సాగాయని, పేదలకు అండగా ఉంటూనే ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే సంస్కరణలను వేగవంతం చేశారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తాము నిర్మించతలపెట్టిన 'స్వర్ణాంధ్ర' విజన్ ద్వారా ప్రధాని మోడీ 'వికసిత్ భారత్' సాధనలో ఏపీ సంపూర్ణ భాగస్వామ్యం వహిస్తుందని సీఎం స్పష్టం చేశారు.
దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ‘ఎక్స్’ వేదికగా ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పాలన దేశానికి నిస్వార్థ సేవ అందించడమే కాకుండా విప్లవాత్మక మార్పులకు వేదికగా నిలిచిందన్నారు. 12 ఏళ్ల క్రితం భారతదేశం ఒక బలమైన, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకుంది. ఈ రోజు ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం మునుపెన్నడూ లేని విధంగా అత్యంత శక్తివంతంగా, సురక్షితంగా, సంపన్నంగా, ఆత్మవిశ్వాసంతో నిలిచిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతను బలోపేతం చేసిందని, సాయుధ దళాలను ఆధునీకరించిందని ఆయన కొనియాడారు. జీ20 సదస్సు నిర్వహణ, గ్లోబల్ సౌత్ దేశాలతో అనుసంధానం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్ స్థానం మెరుగుపడిందన్నారు. డిజిటల్ ఇండియా, జన్ ధన్-ఆధార్-మొబైల్ అనుసంధానం, యూపీఐ, ప్రత్యక్ష నగదు బదిలీ, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజా సేవలను విప్లవాత్మకంగా మార్చాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ.. 'స్వర్ణాంధ్ర 2047' విజన్ కింద ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, అలాగే 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాల కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. భారతదేశ వైవిధ్యం, భాషా సంపదలే దేశానికి గొప్ప బలాలని, దేశ ఐక్యతను దెబ్బతీసే శక్తులను వ్యతిరేకిస్తూ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
