Let's talk: editor@tmv.in
జనసేనలో పార్టీ నిర్మాణానికి కొత్త అడుగు.. రాష్ట్రవ్యాప్తంగా సమాచార సేకరణ కమిటీల నియామకం

జనసేనలో పార్టీ నిర్మాణానికి కొత్త అడుగు.. రాష్ట్రవ్యాప్తంగా సమాచార సేకరణ కమిటీల నియామకం

Dantu Vijaya Lakshmi Prasanna
6 జులై, 2026

జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు కల్పించే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల"ను నియమిస్తూ పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

పార్టీలో కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న జనసైనికుల సేవలను గుర్తించి, వారిలోని నాయకత్వ లక్షణాలను వెలికితీసి, భవిష్యత్ నాయకత్వాన్ని జనసైనికుల నుంచే తీర్చిదిద్దే వినూత్న విధానంగా ఈ కమిటీలను భావిస్తున్నారు.

ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, సాధకులు, జనసైనికుల పనితీరు, పార్టీ పట్ల వారి నిబద్ధత, ప్రజల్లో ఉన్న ఆదరణ, నాయకత్వ సామర్థ్యం వంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నాయి. అనంతరం ఆ నివేదికలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిశీలనకు సమర్పించనున్నాయి.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి మొత్తం ఏడుగురు ప్రధాన సభ్యులు ఉంటారు. వీరితో సమన్వయం చేసుకుంటూ పనిచేసే మరో 21 మంది సాధకులు కూడా కమిటీలో భాగస్వామ్యం అవుతారు. ఈ విధంగా ప్రతి కమిటీ క్షేత్రస్థాయి సమాచారాన్ని సమగ్రంగా సేకరించేలా రూపకల్పన చేశారు.

ప్రతి కమిటీకి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నాయకులను నియమించారు. అలాగే మహిళల పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ వీరమహిళలకు కూ డా ఈ కమిటీల్లో సముచిత స్థానం కల్పించారు. పార్టీ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈ కమిటీల కూర్పును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షించి ఆమోదించినట్లు జనసేన పార్టీ తెలిపింది. కమిటీలు సేకరించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా తీసుకోనున్నారు.

క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రతి జనసైనికుడికి న్యాయం జరిగేలా, అంకితభావంతో పనిచేసిన వారికి సముచిత గుర్తింపు దక్కేలా ఈ ప్రక్రియను రూపొందించినట్లు పార్టీ పేర్కొంది. దశాబ్దన్నర క్రితమే పవన్ కళ్యాణ్ ఆలోచనగా రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థకు ఇప్పుడు కార్యరూపం దక్కిందని, ఇది జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు
JanaSenaPawanKalyanJanaSenaPartyAndhraPradeshAPPoliticsJanaSainiksPartyOrganizationPoliticalNewsLeadershipAssemblyConstituenciesParliamentConstituenciesAPNewsPoliticalUpdatesJanaSenaCadrePartyCommitteesAndhraPoliticsTeluguNewsPawanKalyanNewsJanaSenaUpdatesBreakingNews
జనసేనలో పార్టీ నిర్మాణానికి కొత్త అడుగు.. రాష్ట్రవ్యాప్తంగా సమాచార సేకరణ కమిటీల నియామకం - Tholi Paluku