

రూ.4.58 లక్షల కోట్ల పెట్టుబడులతో రాయలసీమకు కొత్త దశ!
ఒకప్పుడు కరవు, నీటి ఎద్దడి, వలసలతో గుర్తింపు పొందిన రాయలసీమ ఇప్పుడు భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధితో దేశంలోనే కీలక పెట్టుబడి గమ్యస్థానంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశ్రమల ప్రోత్సాహక విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, జిల్లాల వారీగా ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు వంటి చర్యల ఫలితంగా రాయలసీమలో భారీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.
అధికారుల సమాచారం ప్రకారం, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదించిన 172 ప్రాజెక్టుల ద్వారా రూ.4.58 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా కుదిరిన 103 పెట్టుబడి ప్రతిపాదనలు కూడా రాయలసీమకు దక్కాయి. దీంతో మొత్తం 275కుపైగా ప్రాజెక్టులు అమలులోకి రానుండగా, వీటి ద్వారా 3.57 లక్షలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను కేవలం ఒక పారిశ్రామిక ప్రాంతంగా కాకుండా, భవిష్యత్తు తయారీ రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఒకే ప్రాంతంలో పరిశ్రమలను కేంద్రీకరించకుండా, ప్రతి జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక గుర్తింపును కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. తయారీ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, రక్షణ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
కడపలో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారంతో కొత్త మైలురాయి
ఇటీవల కడప జిల్లాలో రూ.16,350 కోట్ల వ్యయంతో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టడం రాయలసీమ పారిశ్రామికాభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలిచింది. ఖనిజ సంపద అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమలు మరింత విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు పెట్టుబడుల కేంద్రం
సమృద్ధిగా ఖనిజ వనరులు, విస్తారమైన భూములు ఉన్నప్పటికీ కరవు, నీటి కొరత, ఉపాధి లేకపోవడం వల్ల రాయలసీమ ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా కొనసాగింది. అయితే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు మధ్య వ్యూహాత్మకంగా ఉండటం, మెరుగైన రహదారి అనుసంధానం, పరిశ్రమలకు అనుకూల విధానాలతో ప్రస్తుతం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోంది.
తిరుపతి.. ఎలక్ట్రానిక్స్, స్పేస్ సిటీగా
తిరుపతి జిల్లా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, డైకిన్, క్యారియర్ గ్లోబల్, ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. క్యారియర్ గ్లోబల్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుంది. మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ.2,500 కోట్లతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటంతో ఆటోమొబైల్ రంగం కూడా బలోపేతం కానుంది.
భవిష్యత్తులో తిరుపతిని 'స్పేస్ సిటీ'గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏరోస్పేస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు
శ్రీ సత్యసాయి జిల్లా పునరుత్పాదక ఇంధన రంగానికి కేంద్రంగా మారుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.51,300 కోట్ల భారీ ఎనర్జీ ప్రాజెక్టును చేపడుతుండగా, గ్రీన్‌కో, చింతా గ్రీన్ ఎనర్జీ, అదానీ హైడ్రో ఎనర్జీ, హెచ్‌ఎఫ్‌సీఎల్ వంటి సంస్థలు కూడా భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఈ జిల్లా కీలకంగా మారనుంది.
కడపలో స్టీల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల అభివృద్ధి
కడప జిల్లా ఉక్కు పరిశ్రమలతో పాటు ఖనిజ ఆధారిత తయారీ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో పాటు కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్, ఐటీ క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కర్నూలు.. సెమీకండక్టర్, డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లాలో రూ.22,976 కోట్ల వ్యయంతో ఇండిచిప్ సెమీకండక్టర్స్ సంస్థ ప్రతిపాదించిన ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో కీలకంగా మారనుంది. దీనితో పాటు డ్రోన్ తయారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి చెందుతుండటంతో కర్నూలును 'డ్రోన్ సిటీ'గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
అనంతపురంలో రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలు
అనంతపురం జిల్లాలో రక్షణ, ఏరోస్పేస్, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర రక్షణ తయారీ రంగంలో ఈ జిల్లా కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిత్తూరుకు ఫుట్‌వేర్ హబ్ గుర్తింపు
దక్షిణ కొరియాకు చెందిన హ్వాసుంగ్ సంస్థ భారత్‌లో తన తొలి తయారీ యూనిట్‌ను చిత్తూరు జిల్లాలో రూ.898 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 17 వేలకుపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. దీంతో చిత్తూరు దేశంలోని ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ కేంద్రంగా ఎదగనుంది.
అన్నమయ్యలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రూ.1 లక్ష కోట్ల వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని ద్వారా ఉద్యానవన పంటలు, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు పెద్దపీట పడనుంది.
నెల్లూరు, నంద్యాలలో కొత్త అవకాశాలు
నెల్లూరు జిల్లాలో టాటా పవర్ రిన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ప్రతిపాదించిన ఇంగాట్, వేఫర్ తయారీ యూనిట్‌తో పాటు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు రానున్నాయి. నంద్యాల జిల్లాలో తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతుండటంతో స్థానిక పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుంది.
జొన్నగిరి బంగారు గనుల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడంతో కర్నూలులో ఆభరణాల తయారీ క్లస్టర్ ఏర్పాటు అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.
రాయలసీమకు రానున్న ప్రధాన పెట్టుబడుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.51,300 కోట్ల ప్రాజెక్టు, సత్యవేడు పారిశ్రామిక అభివృద్ధికి ప్రతిపాదించిన రూ.25,000 కోట్ల ప్రాజెక్టు, ఇండిచిప్ సెమీకండక్టర్స్ రూ.22,976 కోట్ల ప్రాజెక్టు, ఏపీ ఎన్‌జీఈఎల్ హరిత అమృత్ లిమిటెడ్ రూ.22,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ముఖ్యమైనవి. అదనంగా చింతా గ్రీన్ ఎనర్జీ, అదానీ హైడ్రో ఎనర్జీ, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్, అపోలో టైర్స్, ప్రీమియర్ ఎనర్జీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్‌టీపీసీ రిన్యూవబుల్ ఎనర్జీ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టనున్నాయి.
మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి
పరిశ్రమల విస్తరణకు అనుగుణంగా పారిశ్రామిక పార్కులు, ప్లగ్-అండ్-ప్లే తయారీ కేంద్రాలు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్, నిరంతర విద్యుత్ సరఫరా, వేగవంతమైన సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ప్రతిపాదిత అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచి పరిశ్రమలకు మరింత ఊతమివ్వనుంది.
అదేవిధంగా ఐటీఐల ఆధునీకరణ, విశ్వవిద్యాలయాలు–పరిశ్రమల భాగస్వామ్యం, కృత్రిమ మేధ ఆధారిత శిక్షణ వేదికల ద్వారా స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
రాయలసీమను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రాంతీయ అసమానతలను తగ్గించి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పెట్టుబడి వ్యూహం ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు వెల్లడించాయి.
