

మహిళా సాధికారతకు కొత్త దారి.. సింగరేణిలో మహిళా డంపర్ డ్రైవర్లు
దాదాపు 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సిసిఎల్ ) ఒక అద్భుతమైన సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం పురుషులకే పరిమితమైన భారీ యంత్రాల నిర్వహణ రంగంలోకి మహిళలు అడుగుపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళలను డంపర్ ఆపరేటర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ సంకల్పం - సమానత్వానికి మార్గం
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మార్గదర్శకత్వంలో కఠినమైన వృత్తుల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగ వివక్షకు తావులేకుండా మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే ఆత్మవిశ్వాసాన్ని ఈ నిర్ణయం పెంపొందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని కీలక విభాగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కఠిన సవాళ్లను అధిగమించి
సాధారణంగా సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో 60 నుండి 100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ డంపర్లు వినియోగంలో ఉంటాయి. గనుల లోతుల్లో నుంచి బొగ్గును, మట్టిని తరలించడం అత్యంత కఠినమైన పని. ఎండ, వాన అనే తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో ఈ భారీ వాహనాలను నడపాల్సి ఉంటుంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ బాధ్యతలను పురుషులే నిర్వహిస్తుండగా ఇప్పుడు మహిళా ఉద్యోగులు ఆ సవాలును స్వీకరించడానికి సిద్ధమయ్యారు.
శిక్షణతో పెరిగిన ఆత్మవిశ్వాసం
ఈ వినూత్న కార్యక్రమం కోసం సింగరేణిలోని సుమారు 35 మంది మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వీరికి సంస్థా ఖర్చుతో సిరిసిల్లలోని 'తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్' (టైడ్స్)లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. హెవీ మోటార్ వెహికల్ (హెచ్ఎంవీ) లైసెన్స్ పొందిన 13 మంది మహిళలు ఇప్పటికే తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొదట్లో భారీ వాహనాలను చూసి కొంత భయపడినప్పటికీ శిక్షణ తర్వాత మగవారితో సమానంగా తాము కూడా గనుల్లో పని చేయగలమనే ధైర్యం కలిగిందని వారు పేర్కొంటున్నారు.
ఇప్పటికే బెల్లంపల్లి ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్ గనిలో బ్లాస్టింగ్ వంటి అత్యంత ప్రమాదకర విభాగాల్లో మహిళలు విజయవంతంగా రాణిస్తున్నారు. అదేవిధంగా సంస్థ తొలిసారిగా మహిళా రెస్క్యూ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా డంపర్ ఆపరేటర్లుగా మహిళల నియామకం సింగరేణి ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవనుంది. మహిళలు తలచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని సింగరేణి మహిళా ఉద్యోగులు నిరూపిస్తున్నారు.
