
ఎండలకు బ్రేక్… ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్తను అందించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను మించి నమోదవుతూ, జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మే 4వ తేదీన తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమ యానం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తీర ఆంధ్ర ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని రాయలసీమలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఈ అకాల వర్షాల వల్ల ఎండల తీవ్రత తగ్గి, వాతావరణం చల్లబడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మే 5,6 తేదీల్లో వాతావరణం మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్, యానం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ఈ రెండు రోజుల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని దక్షిణ తీర ఆంధ్ర మరియు రాయలసీమలో మోస్తరు గాలులతో కూడిన వానలు పడతాయని అంచనా వేశారు. మే 7వ తేదీ వరకు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఈదురు గాలులు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల చెంత గానీ ఉండకూడదని హెచ్చరించింది. పశువుల కాపరులు, రైతులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఎండల నుంచి విముక్తి లభించినప్పటికీ బలమైన గాలుల వల్ల ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
