

నాలాలో పూడిక తీస్తుంటే బయటపడ్డ మృతదేహం.. అల్వాల్‌లో కలకలం
నాలాల్లో పూడికతీత పనులు చేపట్టినప్పుడు సాధారణంగా పరుపులు, దిండ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడటం చూస్తుంటాం. కానీ, హైదరాబాద్ నగర పరిధిలో నాలాల్లో హైడ్రా యంత్రాంగం పూడిక తీత పనులు కొనసాగిస్తున్న క్రమంలో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారంలో తీవ్ర కలకలం రేపుతూ ఏకంగా ఒక మృతదేహం బయటపడింది. మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో ‘హైడ్రా’ డీఆర్‌ఎఫ్, మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు కలిసి బుధవారం ఉదయం పూడికతీత పనులు చేపట్టాయి. జేసీబీ సహాయంతో నాలాలో భారీగా పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న క్రమంలో, వ్యర్థాలతో పాటు గుర్తు తెలియని ఒక మృతదేహం ఒక్కసారిగా బయటకు వచ్చింది.
నాలాలోని చెత్తలో చిక్కుకుపోవడం వల్ల ఆ మృతదేహం ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేకుండా కేవలం ఎముకలకు శరీరం అతుక్కుని ఉంది. దీనిపై హైడ్రా సిబ్బంది వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ మృతదేహం సుమారు 15 రోజుల క్రితం నాటిది కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ వ్యక్తి ఎవరు? నాలాలోకి ఎలా వచ్చారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు నగరంలో వర్షం నీరు కాలనీలను, రహదారులను ముంచెత్తుతోంది. నాలాల చెత్త తొలగింపు ప్రక్రియలో వ్యర్థాలు భారీగా వెలువడుతున్నాయి. వర్షం పడేటప్పుడు వరద నీరు ముంచెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న హైడ్రా డీఆర్‌ఎఫ్, మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్‌లు 24 X 7 మాదిరి పని చేసి చెత్తను తొలగించే పనుల్లో నిమగ్నమైంది.
