
అమరావతికి భూములిచ్చిన రైతులకు 98 శాతం ప్లాట్ల కేటాయింపు పూర్తి :మంత్రి నారాయణ
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు దాదాపు పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం ప్లాట్ల కేటాయింపు పూర్తి కాగా కేటాయించిన ప్లాట్లలో 89 శాతం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని వెల్లడించారు.
అమరావతి పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మొత్తం 30,753 మంది రైతులు 35,017 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారని పేర్కొన్నారు. అందులో 30,079 మంది రైతులకు 34,527 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లు ఇప్పటికే కేటాయించామని ఇంకా కేవలం 674 మంది రైతులకు చెందిన 489 ఎకరాల భూమికి ప్లాట్ల కేటాయింపు మిగిలి ఉందన్నారు.
అయితే పెండింగ్‌లో ఉన్న కేటాయింపులు ప్రధానంగా కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, అర్హత సమస్యలు వంటి కారణాలతోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కోర్టు కేసుల కారణంగా 65 మందికి అసైన్డ్ కేటగిరీ-4 భూములకు చెందిన 45 మందికి కనీస అర్హత లేకపోవడంతో 324 మందికి ప్లాట్ల కేటాయింపు ఆలస్యమైందన్నారు.
ఇక ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే మొత్తం 70,824 ప్లాట్లలో 63,295 ప్లాట్లు (89.3శాతం) రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 7,529 ప్లాట్లు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయనికోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, ఇనాం, దేవదాయ భూముల సమస్యలు వంటి అంశాల వల్ల రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.
కాగా రాజధానిలో ప్లాట్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరిగిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. లాటరీ విధానంలో రైతుల సమక్షంలోనే ప్లాట్లు కేటాయించామని అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మంచి ప్లాట్లు ఇచ్చారనే ఆరోపణలు అసత్యమని ఖండించారు. అయితే వైసీపీ రాజకీయ దురుద్దేశంతోనే రైతుల విషయంలో రాద్దాంతం చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు.
మరోవైపు అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఇతర నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం సాగుతున్నాయని అధికారుల, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న నివాస టవర్లు దాదాపు పూర్తయ్యాయని వారం రోజుల్లో ఎమ్మెల్యే క్వార్టర్లను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీల నివాసాలను కూడా అందజేస్తామని వెల్లడించారు.
అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాలు తుదిదశకు చేరుకున్నాయని ఈ నెలాఖరుకు కొన్నింటిని వచ్చే నెలాఖరుకు మిగిలిన భవనాలను ప్రభుత్వానికి అందజేస్తామని ఇక ఐకానిక్ టవర్స్ నిర్మాణాన్ని 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు.
ఇదిలాఉండగా ల్యాండ్ పూలింగ్‌కు ముందుకు రాని ప్రాంతాల్లో మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్లు జారీ చేశామని మంత్రి నారాయణ తెలిపారు. అయినప్పటికీ రైతులను ల్యాండ్ పూలింగ్‌లో పాల్గొనాలని కోరుతున్నామని కొందరు ముందుకు వస్తున్నప్పటికీ మరికొందరు కోర్టును ఆశ్రయించారని అయితే కోర్టు నిర్ణయాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
