Let's talk: editor@tmv.in
తెలంగాణ‌లో 91 మంది ఖైదీలు విడుదల
తెలంగాణ‌లో 91 మంది ఖైదీలు విడుదల

తెలంగాణ‌లో 91 మంది ఖైదీలు విడుదల

Gaddamidi Naveen
3 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం 91 మంది యావజ్జీవ ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక రిమిషన్ (శిక్ష కాలం తగ్గింపు) ఉత్తర్వుల ప్రకారం అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను తెలంగాణ కారాగారాలు & సంస్కరణ సేవల శాఖ మంగళవారం విడుదల చేసింది. విడుదలైన వారిలో 85 మంది పురుషులు, 6మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం వీరందరినీ రిమిషన్‌కు అర్హులుగా గుర్తించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

విడుదలైన మాజీ ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ, విజయవంతంగా ప్రజా స్రవంతిలో కలిసిపోయేలా (పునఃసమైక్యం) ప్రోత్సహించేందుకు కారాగార శాఖ పలు సంస్కరణాత్మక చర్యలు చేపట్టింది. ఖైదీలు విడుదలైన తక్షణమే ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో తమ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి జీవనోపాధి అవకాశాలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావించారు.

విడుదలైన 91 మందిలో 38 మంది ఖైదీలకు తెలంగాణ కారాగార శాఖ స్వయంగా నిర్వహిస్తున్న వివిధ ఫ్యూయల్ అవుట్‌లెట్లలో (ఇంధన విక్రయ కేంద్రాలు) ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఇది వారు వెంటనే సాఫీగా జీవనాన్ని సాగించడానికి దోహదపడనుంది. మరో 53 మంది విడుదలైన ఖైదీలు చట్టబద్ధమైన, నిర్మాణాత్మక మార్గంలో స్థిరపడేందుకు వ్యవసాయం, స్వయం ఉపాధి, కుటుంబ వ్యాపారాలు లేదా ఇతర స్వతంత్ర వృత్తులను ఎంచుకోవడానికి ఆసక్తిని కనబరిచారు. మహిళా ఖైదీల పునరావాసం కోసం ‘జైలు అభివృద్ధి నిధి’ కింద అమలు చేస్తున్న స్వయం ఉపాధి సహాయ పథకం ద్వారా నలుగురు మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లను అందజేశారు.

సంస్కరణే జైళ్ల ముఖ్య లక్ష్యం: డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా

ఈ సందర్భంగా తెలంగాణ కారాగారాల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కేవలం ఖైదీల విడుదల మాత్రమే కాదని, బాధ్యతతో కూడిన కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే సందర్భమని పేర్కొన్నారు. కేవలం శిక్ష విధించడమే కాకుండా, వ్యక్తిలో సానుకూల మార్పు తీసుకురావడమే కారాగార వ్యవస్థ లక్ష్యమన్నారు. జైలు గేటు దాటిన తర్వాత కూడా పునరావాస ప్రక్రియ ముగియదని, విడుదల అనంతర సహాయం ఎంతో కీలకమని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమాజంలో మార్పుకు రాయబారులుగా నిలవాలని ఖైదీలకు సూచించారు. ఖైదీల సంస్కరణలకు నిరంతరం సహకరిస్తున్న రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.