Let's talk: editor@tmv.in
90 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు సిద్ధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

90 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు సిద్ధం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
14 ఏప్రిల్, 2026

భారతదేశ ఇంధన భద్రత, ఖనిజ రంగంలో స్వయం సమృద్ధిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలో ప్రస్తుతం 90 రోజులకు సరిపడా, అంటే సుమారు 200 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

సోమవారం హైదరాబాద్‌లో గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'క్రిటికల్ మినరల్ బ్లాక్స్ 7వ విడత వేలం' ,'ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్-ట్రాంచ్ 2' రోడ్‌షోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గతంలో థర్మల్ పవర్ ప్లాంట్లు లేదా పిట్‌హెడ్‌ల వద్ద బొగ్గు నిల్వలు కేవలం 21 నుంచి 25 రోజులకే సరిపడేవని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, తాప విద్యుత్ కేంద్రాలు, గనుల వద్ద ఉన్న నిల్వలతో కలిపి 90 రోజుల అవసరాన్ని తీర్చగల స్థాయిలో నిల్వలు ఉన్నాయని వివరించారు.

దేశంలో బొగ్గు ఉత్పత్తి విషయంలో కూడా కీలక పురోగతి సాధించామని మంత్రి పేర్కొన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఇది దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందనడానికి నిదర్శనమని చెప్పారు. ఖనిజ రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ రంగంలో ఆదాయం కోసం కాకుండా దేశ ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

అర్బన్ మైనింగ్, భవిష్యత్ ప్రణాళికలు

భవిష్యత్తులో అర్బన్ మైనింగ్ (పట్టణ వ్యర్థాల నుంచి ఖనిజాల సేకరణ) కోల్ గ్యాసిఫికేషన్ వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రైవేట్ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే ఈ అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవచ్చని సూచించారు. దేశానికి అవసరమైన కీలక ఖనిజాలలో సుమారు 30 నుంచి 40 శాతం వరకు అర్బన్ మైనింగ్ ద్వారా సేకరించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. పాత ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషనర్లు వంటి ఉపకరణాల నుంచి స్క్రాప్ సేకరించి ఖనిజాలను వెలికితీయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రతి పట్టణం నుంచి ఈ విధమైన వ్యర్థాలను సేకరించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

గనుల వేలంలో నూతన రికార్డులు

ఈ సందర్భంగా కేంద్ర గనుల శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 212 ఖనిజ బ్లాకులను వేలం వేసినట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో మొత్తం 364 బ్లాకులు మాత్రమే వేలం వేయగా, ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో వేలం జరిగిందని చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 684 బ్లాకులను వేలం వేశారు. ఈ ఏడాది 22 క్రిటికల్ మినరల్ బ్లాకులను వేలం వేశారు. దీంతో కలిపి మొత్తం 71 బ్లాకులు (కేంద్రం 46, రాష్ట్రాలు 25) వేలం పూర్తయింది.

మార్చి 23న ప్రారంభమైన 7వ విడతలో 19 బ్లాకులు ఉన్నాయి. ఇందులో 17 కాంపోజిట్ లైసెన్సులు, 2 మైనింగ్ లీజులు ఉన్నాయని ఆయన వివరించారు. క్రిటికల్ మినరల్స్ రంగం భవిష్యత్తులో అత్యంత కీలకమైన 'సన్‌రైజ్ సెక్టార్' అని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచేందుకు మంత్రిత్వ శాఖ నిరంతరం సంస్కరణలు చేపడుతోందని గోయల్ పునరుద్ఘాటించారు.