Let's talk: editor@tmv.in
9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారి పుష్పయాగం

9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారి పుష్పయాగం

Panthagani Anusha
1 నవంబర్, 2025

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వార్షిక పుష్పయాగం వేడుక అత్యంత వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగే వార్షిక క్రతువు కోసం పలు రకాల పూలు, ఆరు రకాల పత్రాలు సహా దాదాపు తొమ్మిది టన్నుల సుగంధభరిత పుష్పాలను ఉపయోగించారు. గులాబీలు, మల్లెలు, కమలం, బంతిపూలు, లిల్లీలు వంటి రకరకాల పూలతో ఆలయ ప్రాంగణం మొత్తం రంగుల శోభతో, పరిమళాలతో నిండిపోయింది. ఈ పుష్పాలలో ఐదు టన్నులు తమిళనాడు నుంచి రెండు టన్నులు చొప్పున కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు సమర్పించారు.

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఈ పుష్పయాగం శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తెలియకుండా జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ వార్షిక ఉత్సవం జరుపుతామని తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులైన శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవిలకు గులాబీలు, మల్లెలు, కమలం, బంతిపూలు, లిల్లీలు, తులసి వంటి 27 రకాల సువాసన భరిత పుష్పాలను, పత్రాలను సమర్పించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం నక్షత్రం రోజున పవిత్రమైన కార్తీక మాసంలో ఈ క్రతువును జరుపుతారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ పుష్ప క్రతువుకు 15వ శతాబ్దం నాటి చరిత్ర ఉంది, అయితే సుదీర్ఘ విరామం తర్వాత 1980లో టీటీడీ దీన్ని తిరిగి పునరుద్ధరించింది అని ఆయన వివరించారు.

ఉదయం స్నపన తిరుమంజనం (పవిత్ర స్నానం) క్రతువు పూర్తయిన అనంతరం ఉత్సవ మూర్తులకు ఈ పుష్ప స్నానాన్ని సమర్పించారు. అంతకుముందు, ఉద్యానవన విభాగం నుంచి ముఖ్య ఆలయం వరకు భారీ పుష్పాల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. శ్రీవారి సేవకులు (వాలంటీర్లు) గార్డెన్ సిబ్బంది పూల బుట్టలను మోస్తూ మార్గమధ్యంలో అంతా "గోవిందా “గోవిందా” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.