
పవర్ గ్రిడ్లో 866 అప్రెంటిస్ పోస్టులు
తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* విద్యుత్ రంగానికి సంబంధించిన మహారత్న సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్), దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 866 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, లా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షకు ఎటువంటి రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఉండదు. మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు స్టైఫండ్ చెల్లిస్తారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.13,500, డిప్లొమా ఎలక్ట్రికల్/సివిల్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.15,000, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్/సివిల్ పోస్టుకు, హెచ్.ఆర్. ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, రాజ్భాష అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.17,500 స్టైఫండ్గా ఇస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు సంబంధిత ఎన్ఏటీఎస్/ఎన్ఏపీఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సదరన్ రీజియన్-I, హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. అభ్యర్థులు తమకు నచ్చిన, తమ రాష్ట్రం పరిధిలోకి వచ్చే ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒక ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
అభ్యర్థులు ముందుగా పవర్ గ్రిడ్ అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. ‘కెరీర్స్’ విభాగంలో ‘ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్’ కింద ఉన్న నోటిఫికేషన్పై క్లిక్ చేసి పూర్తిగా చదవండి. అనంతరం ఆన్లైన్లో అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు ఫారం నింపండి. అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించండి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.powergrid.inని సందర్శించండి.
