
84 మంది ఇరాన్ నావికుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు
హిందూ మహాసముద్రంలో అమెరికా జలాంతర్గామి జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన 84 మంది ఇరాన్ నావికుల భౌతిక కాయాలను శుక్రవారం ప్రత్యేక విమానంలో ఇరాన్‌కు తరలించారు. శ్రీలంక రక్షణ శాఖ సమన్వయంతో మత్తల అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ప్రక్రియ పూర్తయింది. గత వారం శ్రీలంక దక్షిణ తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇరాన్‌కు చెందిన 'ఐరిస్ దేనా' యుద్ధనౌకపై అమెరికా టార్పెడోలతో దాడి చేసి ముంచేసిన విషయం విదితమే.
గాలే కోర్టు అనుమతితో తరలింపు
భారత్‌లో జరిగిన సైనిక విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఈ నౌకలో మొత్తం 130 మంది సిబ్బంది ఉండగా, 84 మంది మరణించగా, 32 మందిని శ్రీలంక నౌకాదళం సురక్షితంగా రక్షించింది. గాలే ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలను గాలే మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇరాన్ రాయబార కార్యాలయానికి అప్పగించారు. శుక్రవారం ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య మృతదేహాలను విమానాశ్రయానికి తరలించి, ప్రత్యేక విమానంలో టెహ్రాన్‌కు పంపారు.
తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతీకారం
ఈ దాడి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. తమ దేశ తీరానికి సుమారు 2000 మైళ్ల దూరంలో అమెరికా జరిపిన ఈ దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా ఖండించారు. "అమెరికా ఒక భారీ నేరానికి పాల్పడింది, దీనికి వారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటారు" అని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇరాన్ తన ప్రతీకార చర్యలను వేగవంతం చేస్తూ, మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాల లక్ష్యంగా వరుస దాడులకు దిగుతోంది. శ్రీలంకలో ఉన్న మిగిలిన 32 మంది నావికులు ప్రస్తుతం అక్కడే నిఘా వర్గాల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.
