Let's talk: editor@tmv.in
80 వేల మెట్రిక్ టన్నుల చమురుతో భారత్‌కు 'జగ్ లాడ్కీ'

80 వేల మెట్రిక్ టన్నుల చమురుతో భారత్‌కు 'జగ్ లాడ్కీ'

Shaik Mohammad Shaffee
19 మార్చి, 2026

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో, భారత జెండాతో ఉన్న ముడిచమురు ట్యాంకర్ ‘జగ్‌ లాడ్కీ’ సురక్షితంగా గుజరాత్‌లోని అదానీ ముంద్రా పోర్టుకు చేరుకుంది. యూఏఈలోని ఫుజైరా ఓడరేవు నుంచి సుమారు 80,886 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో వచ్చిన ఈ నౌక రాక, దేశ ఇంధన అవసరాల దృష్ట్యా అత్యంత కీలకంగా మారింది. దేశంలోని ప్రధాన రిఫైనరీలకు ముడిచమురు సరఫరాను నిరంతరం కొనసాగించడంలో ముంద్రా ఓడరేవు పోషిస్తున్న పాత్రను ఈ పరిణామం మరోసారి చాటిచెప్పింది.

భారీ నౌక.. భారీ సరుకు

దాదాపు 274.19 మీటర్ల పొడవు, 50.04 మీటర్ల వెడల్పు కలిగిన ఈ భారీ ట్యాంకర్ సామర్థ్యం 1,64,716 టన్నులు (డెడ్ వెయిట్). అంతర్జాతీయంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో ముడిచమురును తీసుకురావడం భారత నౌకాయాన రంగానికి దక్కిన గొప్ప విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నౌక రాకతో దేశీయ చమురు నిల్వలకు కావాల్సిన ముడి సరుకు సకాలంలో అందుబాటులోకి వచ్చింది.

నౌకాదళం నిరంతర నిఘా

సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల రక్షణ కోసం భారత నౌకాదళం చేపట్టిన ‘ఆపరేషన్ సంకల్ప్’ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్మూజ్ జలసంధి వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో భారత నౌకలకు రక్షణ కవచంలా నిలుస్తూ, సరుకు రవాణాకు ఆటంకం కలగకుండా నేవీ పహారా కాస్తోంది. ఇప్పటికే మార్చి 16, 17 తేదీల్లో ‘ఎంటీ శివాలిక్’, ‘ఎంటీ నందాదేవి’ అనే రెండు ఎల్‌పీజీ వాహక నౌకలు కూడా సుమారు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయి.

ప్రభుత్వ అప్రమత్తత - రాయితీలు

ప్రస్తుత పరిస్థితులను కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, నౌకల యజమానులు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ వాణిజ్యానికి విఘాతం కలగకుండా చూస్తోంది. అంతేకాకుండా యుద్ధ వాతావరణం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఓడరేవుల్లో బెర్త్ హైర్, స్టోరేజీ ఛార్జీలు, ఇతర రుసుముల్లో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం పోర్టులను ఆదేశించింది.

80 వేల మెట్రిక్ టన్నుల చమురుతో భారత్‌కు 'జగ్ లాడ్కీ' - Tholi Paluku