
8వ శతాబ్దపు బాదామి చాళుక్య రాజుల సమాధులను సంరక్షించేందుకు ప్రతిపాదన
ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో తురువేకెరే తాలూకా, ఆనడగు గ్రామం పొలాల్లో ఒక వీరశిలాశాసనం లభించింది. ఈ శాసనం క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినది. ఇది కన్నడ భాషలో, ఆ కాలపు లిపిలో వ్రాయబడింది. ఈ శాసనం భాగికంగా (అధూరంగా) లభించింది. ఇందులో ఒక వీరుడి మరణం గురించి ప్రస్తావించబడింది. ఆ వీరుడే శ్రీ కేసరి అని, చాళుక్య రాజు రెండవ విక్రమాదిత్యుడు (క్రీ.శ. 733–744) సైన్యం శ్రీకేశరి మీద దాడి చేసినప్పుడు అతడు వీరమరణం పొందినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ శాసనం బాదామి చాళుక్య రాజు రెండవ విక్రమాదిత్యుడు తన కాలంలో పల్లవ రాజుల ఆధీనంలో ఉన్న కాంచీ నగరాన్ని మూడుసార్లు జయించాడు అని చెబుతుంది. ఈ విషయాన్నిఈ పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకేశరి ఎవరు, ఆయన ఏ ప్రాంతానికి ప్రతినిధిగా ఉన్నారన్న విషయంపై మరింత పరిశోధన అవసరమని ఈ శాసనం సూచిస్తోందని చెప్పారు. అలాగే ఈ శాసనానికి సంబందించి ఆయన కొన్ని సంఘటనలు పేర్కొన్నారు.
నేను ప్రముఖ శిలాశాసన పండితుడు డా. కె.వి. రమేష్ రచించిన “చాళుక్యాస్ ఆఫ్ వాతాపి” అనే గ్రంథాన్ని పరిశీలించినప్పుడు కర్ణాటక లో లభించిన శాసనంలో తెలుపబడిన విషయాలన్నీ ఈ గ్రంధంలో వున్నాయి అన్నారు. అవేమిటంటే ఆ శాసనం ప్రకారం, రెండవ విక్రమాదిత్య సేన దాడిలో వీరమరణం పొందిన శ్రీకేసరి అనే వీరుని గాథ ఉంది. పట్టదకల్ (కర్ణాటక) నుండి సుమారు 5 కిలోమీటర్ల పశ్చిమ దిశలో ఉన్న భద్ర నాయకన జలిహాళ అనే ప్రదేశంలో,“హులిగెవ్వన కొళ్ళ” అని పిలువబడే ఎర్ర రాతి కొండలతో ఏర్పడిన U ఆకారపు లోయలో, వివిధ పరిమాణాలలో 11 స్మారక గుడులు ఉన్నట్లు ఈ గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. “హులిగెవ్వన కొళ్ళ” అనే పదానికి అర్థం “జానపద తల్లిదేవత హులిగి నివసించే లోయ” లేదా “హులిగి అమ్మ లోయ” అంటే ఈ పేరు స్థానిక ప్రజల భక్తి, పురాణ గాథలు, భూభాగానికి సంబంధించిన జానపద విశ్వాసాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
వీటిలో లోయ దిగువన ఉన్న అతిపెద్ద గుడి శిలాశాసనం ప్రకారం, అది రెండవ విక్రమాదిత్య సమాధి స్థలం అని తెలుసుకోబడింది. అతని ఇద్ధరు భార్యలు లోకమహాదేవి, త్రైలోక్యమహాదేవి లకు సంబంధించిన రెండు చిన్న గుడులు ప్రధాన సమాధి రెండు వైపులా ఉన్నట్లు భావిస్తున్నాము. అలాగే ఇతర చాళుక్య రాజ కుటుంబ సభ్యుల సమాధులు కూడా అక్కడే ఉన్నట్లు తేలింది. అన్నారు.
ఇంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బాదామి చాళుక్యుల రాజసమాధి స్థలం ఇప్పటికీ కేంద్ర లేదా రాష్ట్ర పురావస్తు శాఖ రక్షణలో ఎందుకు లేదో ఆశ్చర్యకరం గా వుంది అన్నారు. అందువల్ల, ధారవాడ పురావస్తు సర్వే కార్యాలయం ఈ విలువైన స్మారక కట్టడాలను భవిష్యత్తు తరాల కోసం సంరక్షించే విధంగా రక్షణలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను పురావస్తు శాఖకు త్వరలో సమర్పించబోతోందని మునిరత్నం రెడ్డి అన్నారు.
ఈ స్థలమే కాదు, శాసనం లభించిన ప్రాంతం సమీపంలోని మాహకూట దేవాలయ సముదాయం బాదామి చాళుక్యుల కుటుంబ దైవం. ఇది ఒక “దేవద్రోణి” స్థలం కూడా ప్రభుత్వ నియంత్రణలో లేదు. ఆ ప్రాంతాన్ని ఒక ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. కొన్నేళ్ల క్రితం వారు అక్కడ కళ్యాణ మంటపం నిర్మించాలనుకున్నారు. అప్పుడు నేను జోక్యం చేసుకుని, ఆ ట్రస్ట్ నిర్వాహకులతో మాట్లాడాను.చివరికి వారిని ఒప్పించి, కల్యాణ మంటపాన్ని దేవాలయ సముదాయానికి బయట నిర్మించేలా చేయగలిగాను. దాంతో, ఇప్పుడు ఆ మంటపం మకుటేశ్వరనాథ ఆలయపు గోడ వెనుక భాగంలో ఉంది.
మాహకూట స్తంభ శాసనం లో ఈ దేవుడి పేరు మంగళేశుడు అని, రెండవ పులకేశి కలచూరులను జయించి సంపాదించిన సర్వసంపదను తనకు సమర్పించాడని రాసి వుందని అన్నారు. దీనిని కూడా పరిశీలిస్తామని అన్నారు. కాగా 30-10-2025 గురువారం రోజు ఏఎస్ఐ (పురావస్తు శాఖ) బృందాలు కర్ణాటకలో శాసనం లభించిన స్థలాన్ని సందర్శించి, రక్షణ చర్యల ప్రతిపాదన కోసం పరిశీలించాయి అని పురావస్తు శాఖ డైరెక్టర్ తెలిపారు.
