

రాష్ట్రంలో 79 కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రి విజయవంతంగా 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసి అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ ఘనత సాధించిన నిమ్స్ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బందిని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం నిమ్స్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్ ఆసుపత్రి ఒకే సంస్థాగత కార్యక్రమం కింద 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. వైద్య బృందం యొక్క అంకితభావం, నిరంతర కృషి వల్లే ఈ అరుదైన ఘనత సాధ్యమైందని ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయని స్పష్టం చేశారు.
ఒకప్పుడు కిడ్నీ మార్పిడి అనేది కేవలం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన వైద్యమని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి సేవలను అందిస్తోందన్నారు. శస్త్రచికిత్స ఖర్చులను భరించడమే కాకుండా, ఆపరేషన్ తర్వాత రోగులు జీవితాంతం వాడాల్సిన మందులను కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోందని వెల్లడించారు.
రాష్ట్రంలో డయాలసిస్ సేవల నుంచి అవయవ మార్పిడి వరకు ఒక సంపూర్ణమైన 'కిడ్నీ కేర్ వ్యవస్థ'ను ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటికి అదనంగా మరో 79 కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నిమ్స్‌తో పాటు గాంధీ, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులలో కూడా అవయవ మార్పిడి సేవలను బలోపేతం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగానే ఇటీవలే గాంధీ ఆసుపత్రిలో 'స్టేట్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్'ను ప్రారంభించామన్నారు. అలాగే సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను అవయవ మార్పిడి విభాగంలో ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
