
785 బిలియన్ డాలర్ల బడ్జెట్‌కు జపాన్ కేబినెట్ ఆమోదం
జపాన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్‌ను ప్రకటించింది. 2026 సంవత్సరానికి సంబంధించి శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మొత్తం 122.31 ట్రిలియన్ యెన్‌ల (సుమారు 783 బిలియన్ డాలర్లు) బడ్జెట్‌కు ఆమోదం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఖర్చులు చాలా పెరిగాయని, దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద బడ్జెట్ అని ప్రభుత్వం చెబుతోంది.
అక్టోబర్‌లో పదవిలోకి వచ్చిన ప్రధాని సనాయే టకైచి నాయకత్వంలో రూపొందిన ఇది తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఖర్చులను పెంచుతోంది. అయితే దేశ అప్పులు ఎక్కువవుతున్నాయనే ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.
ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు పెరిగాయి. మరోవైపు జపాన్‌లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పింఛన్లు, వైద్యం వంటి సంక్షేమ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా సంక్షేమ రంగానికి మాత్రమే 39.06 ట్రిలియన్ యెన్‌లు కేటాయించారు. ఇది బడ్జెట్‌లోనే అతిపెద్ద భాగం.
ప్రభుత్వ ఆదాయం సరిపోకపోవడంతో, 29.58 ట్రిలియన్ యెన్‌ల కొత్త అప్పులు (బాండ్లు) తీసుకోవాలని నిర్ణయించింది. జీ7 దేశాల్లో జపాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ, ఈ ఏడాది అప్పులపై ఆధారపడే శాతం కొంత తగ్గుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో 9.04 ట్రిలియన్ యెన్‌లు కేటాయించారు. అలాగే, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల కోసం 1 ట్రిలియన్ యెన్‌లను రిజర్వ్ ఫండ్‌గా ఉంచారు. ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో, పాత మౌలిక వసతుల మరమ్మతుల కోసం 6.11 ట్రిలియన్ యెన్‌లు ఖర్చు చేయనున్నారు.
వ్యవసాయం, మత్స్యరంగానికి 2.30 ట్రిలియన్ యెన్‌లు కేటాయించారు. ముఖ్యంగా బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరఫరాను స్థిరంగా ఉంచడమే లక్ష్యం. మరోవైపు, దేశ అప్పులపై వడ్డీ భారం కూడా పెరుగుతోంది. అప్పుల చెల్లింపుల కోసం మాత్రమే 31.28 ట్రిలియన్ యెన్‌లు ఖర్చు అవుతున్నాయి.
ఈ భారీ ఖర్చుల ప్రభావంతో జపాన్ కరెన్సీ యెన్ విలువ పడిపోతోంది, ఇది ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశానికి సమస్యగా మారింది. 2026 నాటికి జపాన్ మొత్తం ప్రభుత్వ అప్పులు 1,344 ట్రిలియన్ యెన్‌లకు చేరుతాయని అంచనా, ఇది దేశ జీడీపీకి దాదాపు రెండింతలు.
జపాన్ తన ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కడానికి ఒక కొత్త పద్ధతిని ఎంచుకుంది. అప్పులు ఎక్కువగా ఉన్నాయని భయపడి ఖర్చులు తగ్గించుకోకుండా, భవిష్యత్తులో లాభాలనిచ్చే సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల కొత్త ఉద్యోగాలు వచ్చి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని వారి నమ్మకం. మరోవైపు, దేశంలో యువత సంఖ్య తగ్గుతుండటంతో.. ఆ లోటును భర్తీ చేయడానికి మహిళలకు, వృద్ధులకు, విదేశీ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అంతేకాకుండా, ప్రజల దగ్గర డబ్బు ఉంటేనే మార్కెట్ బాగుంటుందని భావించి, కంపెనీలు జీతాలు పెంచేలా ప్రోత్సహిస్తోంది. జపాన్ కేవలం పొదుపు మీద ఆధారపడకుండా, తెలివైన పెట్టుబడులు, సమాజంలో మార్పుల ద్వారా తన పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
