Let's talk: editor@tmv.in
78 ఏళ్ల చీకటిని చెరిపేసిన విద్యుత్ కాంతి

78 ఏళ్ల చీకటిని చెరిపేసిన విద్యుత్ కాంతి

Panthagani Anusha
19 సెప్టెంబర్, 2025

స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడిచిపోయినా, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇంకా ప్రాథమిక సౌకర్యాలు అందక చీకట్లోనే జీవనం సాగిస్తున్న గ్రామాలు ఉన్నాయి. సాంకేతికతలో ఎన్నో అద్భుతాలు సాధించినప్పటికీ, ప్రతి పల్లెకు అభివృద్ధి చేరడం మాత్రం ఆలస్యంగానే జరుగుతోంది. ఈ మాటలకు ఉదాహరణగా మహారాష్ట్రలోని థానే జిల్లా షాహాపూర్ తాలూకాలోని వరసవాడి గ్రామాన్ని చెప్పుకోవచ్చు. స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత ఈ చిన్న గిరిజన వసతికి విద్యుత్ వెలుగులు చేరువయ్యాయి. .

మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (మహావితరణ) కృషితో సెప్టెంబర్ 18వ తేదీ నుంచి వరసవాడి గ్రామంలో లైట్లు వెలిగాయి. కల్యాణ్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా గ్రామానికి విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. ఇప్పటివరకు నూనె దీపాలు, కొవ్వొత్తులపై ఆధారపడిన గ్రామస్తులు ఇప్పుడు విద్యుత్ వెలుగుతో కొత్త ఉత్సాహం పొందారు. రాత్రివేళల్లో ఇళ్లలో బల్బులు వెలగడం, వీధులలో లైట్స్ మెరుస్తుండడం చూసి గ్రామస్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

ఇక గ్రామం విషయానికి వస్తే వరసవాడి చిన్న వసతి మాత్రమే. ఇక్కడ నివసించే కుటుంబాల సంఖ్య ఎక్కువ కాదు. సుమారు 60 మంది మాత్రమే ఉంటారు. ప్రధాన గ్రామమైన ఫుగలేకు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇంతకాలం వరకు అభివృద్ధి దిశగా పెద్దగా మార్పులు జరగలేదు. గ్రామం ప్రభుత్వ దృష్టికి రాకపోవడంతో ఇక్కడి ప్రజలు చీకట్లోనే జీవితాన్ని గడపాల్సి వచ్చింది.

అయితే, గిరిజన సంఘాల పట్టుదల, వారి కృషి వల్లే ఈ రోజు ఆ గ్రామంలో వెలుగు సాధ్యమైంది. ఆ పట్టుదలే నాలుగేళ్ల తర్వాత ఫలించి,2020లో గిరిజన సంఘాలు చేసిన నిరంతర కృషి, ప్రభుత్వ అధికారుల వద్ద పెట్టిన విన్నపాల ఫలితమే ఇప్పుడు వెలుగులు రావడానికి కారణమైంది.మరోవైపు వరుసవాడి గ్రామస్థులు ఇక పిల్లలు రాత్రి వేళల్లో సైతం చదవగలరు, గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, లైట్స్ వెలుగుల మధ్య గ్రామస్తులు పటాకులు పేల్చి పండుగలా జరుపుకున్నారు.

ఈ సంఘటన ఒక చిన్న విజయమే అయినా, దాని వెనుక ఉన్న సందేశం గొప్పది. దేశంలో ఇంకా ఇలాంటి వందల గ్రామాలు ప్రాథమిక సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నాయి. విద్యుత్తో పాటు రహదారులు, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, పాఠశాలలు వంటి సదుపాయాలు ప్రతి పల్లెకు చేరితేనే భారతదేశం నిజంగా అభివృద్ధి సాధిస్తుంది. వరసవాడి విద్యుత్ వెలుగుతో వెలిగినట్టే, ఇంకా మిగిలిన గ్రామాలు సైతం త్వరలో అభివృద్ధి వెలుగులు చూడాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

78 ఏళ్ల చీకటిని చెరిపేసిన విద్యుత్ కాంతి - Tholi Paluku