
71.64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ: మంత్రి ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం సేకరణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు 71.64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని, దీనివల్ల రూ.19,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ సేకరణ ద్వారా 15 లక్షలకుపైగా రైతులు నేరుగా లాభం పొందారని, ఇంత భారీ స్థాయి సేకరణ దేశంలో మరే రాష్ట్రం సాధించలేదని ఆయన పేర్కొన్నారు.
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రబీ ధాన్య సేకరణ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసిన మంత్రి, వ్యవస్థలో అవకతవకలకు పూర్తిగా తావులేదని ఆదేశాలు జారీ చేశారు. ధాన్య కేటాయింపుల్లో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులకు ఇకపై ఎలాంటి ధాన్యం కేటాయించబోమని తేల్చి చెప్పారు. చట్టపరమైన చర్యల కోసం పౌర సరఫరాల కేసుల్లో న్యాయ అమలు మార్గదర్శకాలు అనే పుస్తకాన్ని కూడా మంత్రి విడుదల చేశారు.
ప్రతి సంవత్సరం రైతులకు సుమారు రూ.38,000 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోందని, ఇది రైతుల ఆర్థిక భద్రతకు బలమైన ఆధారమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 85 శాతం ప్రజలకు నెలకు 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. తెలంగాణలోనే పండిన సన్నబియ్యాన్ని వినియోగించడం ద్వారా స్థానిక రైతులకు మరింత మద్దతు లభిస్తోందన్నారు.
అంతేకాకుండా, ఎగుమతులపై దృష్టి సారించిన వరి విధానం, ప్రోత్సాహకాలు అమలులోకి తీసుకువస్తున్నామని, నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు స్టీల్ సైలోల ఏర్పాటు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అన్ని ధాన్య సేకరణ కేంద్రాల్లో డ్రైయర్లు, పాడీ క్లీనర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అవకతవకలకు జీరో టాలరెన్స్ ఉంటుందని, నిజాయితీగా పనిచేసే మిల్లులకు పూర్తి సహకారం, రైతులకు సంపూర్ణ మద్దతు అందిస్తామని మంత్రి అన్నారు.
