Let's talk: editor@tmv.in
71 మంది మావోయిస్టులు లొంగుబాటు!

71 మంది మావోయిస్టులు లొంగుబాటు!

FL - SUNL
25 సెప్టెంబర్, 2025

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆపరేషన్ కగార్‌తో మావోలు కకావికలం అవుతుండగా, తాజాగా భారీ లొంగుబాటుతో మావోయిస్టు వ‌ర్గాల్లో భారీ కుదుపున‌కు గుర‌య్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద లొంగిపోయిన ఈ మావోయిస్టుల్లో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 30 మందిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కేంద్రం నిర్ణ‌యాల‌తో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్‌ తెలిపారు. మావోయిస్టుల ఏరివేతను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తుండటంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేదన్నారు. తాజాగా లొంగిపోయిన వారంతా గతంలో అనేక విధ్వంసక సంఘటనల్లో ప్రత్యక్షంగా భాగ‌స్వాములైన‌ట్లు బస్తర్ ఐజీ తెలిపారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టులు హింసాత్మ‌క విధానాలు వదిలేలా చేయడమే తమ ఉద్దేశమని, జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'తో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు.

71 మంది మావోయిస్టులు లొంగుబాటు! - Tholi Paluku