Let's talk: editor@tmv.in
నాణ్యత పరీక్షలు లేకుండా 70 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు: ఏకసభ్య కమిషన్ నివేదిక

నాణ్యత పరీక్షలు లేకుండా 70 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు: ఏకసభ్య కమిషన్ నివేదిక

Panthagani Anusha
4 మే, 2026

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను మసకబార్చిన లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదికను సమర్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిషన్, గత పాలకమండలి హయాంలో జరిగిన నెయ్యి కొనుగోలు ప్రక్రియలో పెను లోపాలను ఎత్తిచూపింది. సుమారు 70 లక్షల కిలోల నెయ్యిని ఎటువంటి నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కొనుగోలు చేయడం వెనుక వ్యవస్థాగత వైఫల్యాలే ప్రధాన కారణమని కమిషన్ నిర్ధారించింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే సరఫరాదారులు యథేచ్ఛగా కల్తీ నెయ్యిని పంపే అవకాశం లభించిందని నివేదిక పేర్కొంది.

నిబంధనల సడలింపు – అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం నెయ్యి స్వచ్ఛతను పరీక్షించే కీలకమైన 'బీటా-సిటోస్టెరాల్' పరీక్షను 2022 జూలై నుండి అమలు చేయాలని తొలుత నిర్ణయించినప్పటిక ఆ తర్వాత సరఫరాదారులకు లబ్ధి చేకూర్చేలా ఆ నిబంధనను రద్దు చేశారు. భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు తమ బాధ్యతలను విస్మరించడమే కాకుండా వెజిటబుల్ ఫ్యాట్లు ఉన్నట్లు నిర్ధారించిన ల్యాబ్ నివేదికలను సైతం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు కమిషన్ ఆరోపించింది. ముఖ్యంగా 2022 ఆగస్టులో CFTRI నిర్వహించిన పరీక్షల్లో కల్తీ జరిగినట్లు స్పష్టమైనా ఆ నివేదికను బయటపెట్టకుండా తొక్కిపెట్టడం గమనార్హం.

అసంబద్ధమైన టెండర్ విధానాలు – తక్కువ ధరకే ప్రాధాన్యత

టెండర్ల ఖరారులో అనుసరించిన విధానాలు కల్తీకి ప్రధాన ప్రోత్సాహకంగా నిలిచాయని కమిషన్ వెల్లడించింది. నాణ్యత కంటే తక్కువ ధర కోట్ చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కిలో నెయ్యి ధరను రూ.207 వరకు తగ్గించి బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఇంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యం కాదని తెలిసి కూడా అధికారులు వాటిని ఆమోదించడంపై కమిషన్ విస్మయం వ్యక్తం చేసింది. దీనికి తోడు 2019లో ఉన్న కఠినమైన అర్హత ప్రమాణాలను సడలించడం వల్ల అనర్హత కలిగిన సంస్థలు సైతం సరఫరా వ్యవస్థలోకి ప్రవేశించాయని నివేదిక స్పష్టం చేసింది.

మౌలిక సదుపాయాల లేమి పర్యవేక్షణ వైఫల్యం

టీటీడీ సొంత ల్యాబ్‌లలో తక్షణ నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక పరికరాలు లేకపోవడం మరో ప్రధాన లోపంగా గుర్తించింది. ఆ పరికరాల అప్‌గ్రేడ్ ప్రక్రియను దాదాపు మూడేళ్ల పాటు జాప్యం చేయడం వల్ల కల్తీని సకాలంలో గుర్తించలేకపోయారని కమిషన్ తెలిపింది. అదేవిదంగా టెక్నికల్ ఈవాల్యుయేషన్, ప్లాంట్ ఇన్‌స్పెక్షన్ కమిటీల్లో ఒకే వ్యక్తులు ఉండటం వల్ల స్వతంత్ర పర్యవేక్షణ లోపించిందని నివేదిక పేర్కొంది. భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ వంటి సంస్థలు ప్రతికూల నివేదికలు ఉన్నప్పటికీ సరఫరాను కొనసాగించడం అధికారుల అండదండలకు నిదర్శనమని కమిషన్ స్పష్టం చేసింది.

బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం

కాగా ఈ మొత్తం కుంభకోణానికి టీటీడీ అప్పటి బోర్డు సభ్యులు, కొనుగోలు కమిటీ అధికారులు సాంకేతిక నిపుణులదే బాధ్యతని కమిషన్ స్పష్టం చేసింది. విధానపరమైన లోపాలు ఉద్దేశపూర్వక తప్పిదాల వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దినేష్ కుమార్ కమిషన్ సమర్పించిన ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.