Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో 7 లక్షల కొత్త ఓట్లు

బెంగాల్‌లో 7 లక్షల కొత్త ఓట్లు

Panthagani Anusha
20 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముగియడంతో, సుమారు 7 లక్షల మంది కొత్తగా ఓటు హక్కును పొందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కొత్త ఓటర్ల వయస్సు, లింగ విభజన వంటి కీలక గణాంకాలను అధికారులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదనపు ఓట్లు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెండు దశలపై ప్రభావం

ఎన్నికల షెడ్యూల్‌ను విశ్లేషిస్తే ఈ కొత్త ఓటర్ల ప్రభావం మొదటి రెండు దశల్లోనే స్పష్టంగా కనిపించనుంది. మొత్తం నమోదైన వారిలో 3.22 లక్షల మంది తొలి దశలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా మిగిలిన 3.88 లక్షల మంది రెండో దశలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున వేల సంఖ్యలో కొత్త ఓట్లు చేరడం వల్ల హోరాహోరీ పోరు సాగే స్థానాల్లో ఈ 'కొత్త' ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాల వెల్లడిపై ఈసీ మౌనం

సాధారణంగా ఓటర్ల జాబితా విడుదల చేసినప్పుడు 18 ఏళ్లు నిండిన యువత ఎంతమంది? పురుషులు, మహిళలు, ఇతర లింగాల వారు ఎంతమంది? అనే వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేస్తుంది. కానీ ఈసారి కేవలం అంకెలకే పరిమితమైంది. ఫారం-6 ద్వారా వచ్చిన దరఖాస్తుల ఆమోదం తిరస్కరణల వెనుక ఉన్న లోతైన గణాంకాలను భద్రపరిచామని ప్రస్తుతానికి మొత్తం సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. "నిబంధనలకు అనుగుణంగానే గణాంకాలను విడుదల చేశాం. వివరణాత్మక సమాచారాన్ని భవిష్యత్తులో అవసరమైతేనే వెల్లడిస్తాం అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించడం విశేషం.

6.82 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య

తాజా మార్పుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 6,82,51,008 కు చేరుకుంది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మరికొన్ని పేర్లు జాబితాలో చేర్చే అవకాశం ఉన్నందున, తుది పోలింగ్ నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు, కొత్త ఓటర్ల నమోదు రాజకీయ పార్టీలకు కీలక అంశంగా మారింది. ముఖ్యంగా యువ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారో అన్న ఆందోళన అటు అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోనూ ఇటు విపక్ష బీజేపీలోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

కొత్తగా నమోదైన వారిలో మెజారిటీ ఓటర్లు యువత కావడంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ నిరుద్యోగం, విద్య, అభివృద్ధి వంటి అంశాలను పార్టీలు బలంగా ప్రస్తావిస్తున్నాయి. ప్రతి ఓటూ కీలకమైన ఈ ఎన్నికల్లో ఈ ఏడు లక్షల మంది 'కొత్త' ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తుండగా ఫలితాలు మే 4న వెల్లడించనున్నారు.