
7, 8 తేదీల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు.
మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామంచదర్ రావు పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయాలు, మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీకి తన పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్, అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారు అని తెలిపారు. ఈ నెల 7, 8వ తేదీల్లో ప్రచారం చేసేందుకు రానున్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం వెల్లడించింది. తెలంగాణలో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు.
పవన్ కళ్యాణ్ రాకతో తెలంగాణలో బీజేపీకి భారీ ఊపు వస్తుందని, గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ త్వరలోనే విడుదల కానుంది.
