Let's talk: editor@tmv.in
7 ఏళ్ల తర్వాత జైలు నుంచి బ్రహ్మోస్ మాజీ శాస్త్రవేత్త విడుదల

7 ఏళ్ల తర్వాత జైలు నుంచి బ్రహ్మోస్ మాజీ శాస్త్రవేత్త విడుదల

Pinjari Chand
4 డిసెంబర్, 2025

బ్రహ్మోస్ మిస్సైల్ కేంద్రంలో పనిచేసిన అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త నిషాంత్ అగర్వాల్‌ను పాకిస్తాన్ కోసం గూఢచార్యం చేశాడన్న ఆరోపణలను బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన నిర్దోషిగా విడుదల అయ్యారు. మంగళవారం రాత్రి నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. 2018లో అరెస్టు అయిన అగర్వాల్ ఏడేళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. విదేశీ ఉద్యోగం కోసం జాగ్రత్త లేకుండా చేసిన ఒక్క తప్పిదమే ఆయన కెరీర్‌ను నాశనం చేసింది. బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో జరిగిన విచారణలో ముఖ్యంగా ‘మెన్ రియా’ (నేర మనస్తత్వం) ఉనికి లేకపోవడమే కీలకంగా మారింది. అగర్వాల్‌పై అధికారిక రహస్యాల చట్టం, ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.

అవును మంగళవారం రాత్రి ఆయన నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు అని ఆయన న్యాయవాది చైతన్య బి బర్వే మీడియాకు తెలిపారు. 34 ఏళ్ల నిషాంత్ అగర్వాల్‌తో (2017-18కి ‘యంగ్ సైంటిస్ట్ అవార్డు’ అందుకున్నారు) మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు.

కానీ ఆయన సన్నిహిత బంధువు ఒకరు ఇలా అన్నారు దేశ న్యాయం కోసం దీర్ఘకాలిక పోరాటం తర్వాత కుటుంబమంతా ఉపశమనం పొందింది. ఆయన జీవితాంతం పోరాడేవాడే, మళ్లీ కెరీర్‌ను కొనసాగిస్తారు.

అసలేమైంది

నిషాంత్ అగర్వాల్ లింక్డ్‌ఇన్‌లో తన బయోడేటాను అప్‌లోడ్ చేశారు. అక్కడ ‘సేజల్ కపూర్’ అనే పేరుతో ఒక మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ అకౌంట్ పాకిస్తాన్ నుంచి నడుస్తోందని ఆయనకు తెలియదు. ఉత్తరప్రదేశ్ పోలీసుల యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారి పంకజ్ అవస్థి ప్రకారం 2017 డిసెంబర్ 19న సేజల్ కపూర్ యూకేలో ఉద్యోగ అవకాశం గురించి చెప్పి, ఇంటర్వ్యూకి ఒక సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేయమని చెప్పింది. అది మాల్వేర్ అని తర్వాత తేలింది.

ఎలాంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేయలేదు

అగర్వాల్ లింక్డ్‌ఇన్‌లో ఎలాంటి డిపార్ట్‌మెంటల్ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయలేదు. బ్రహ్మోస్ సంస్థ నుంచి లింక్డ్‌ఇన్ వాడకంపై ఎలాంటి నిషేధం లేదు. ఉద్యోగం కోసం వెతకడంపై కూడా ఆంక్షలు లేవు. ఆయన ల్యాప్‌టాప్‌లో దొరికిన ఫైళ్లన్నీ 2013లో రిక్రూట్ అయిన 23 మంది బ్యాచ్‌మేట్స్‌కు ఇచ్చిన శిక్షణా కిట్‌లోనివే.హైకోర్టు తీర్పు ముఖ్యాంశాలునేర ఉద్దేశం రుజువు కాలేదు. హనీ ట్రాప్ ఆరోపణలు నిరూపితం కాలేదు, ఎలాంటి సమాచారం పంపినట్టు ఆధారాలు లేవు. మాల్వేర్ డౌన్‌లోడ్ చేయడం కేవలం యూకే ఉద్యోగం కోసమే తప్ప దేశ భద్రతకు వ్యతిరేకంగా కాదని తెలిపింది.

సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఆయన సిస్టమ్ లోకి మాల్వేర్ డౌన్ లోడ్ కావడమే. అది ఆయనకు తెలియకపోవడం. మిగతా అన్ని ఆరోపణల నుంచి (ఐటీ యాక్ట్ 66ఎఫ్, ఓఎస్ఏ సెక్షన్ 3 సహా) పూర్తిగా నిర్దోషిగా విడుదల చేశారు. ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన తీర్పును 49 పేజీల తీర్పులో రద్దు చేస్తూ, జస్టిస్ అనిల్ ఎస్ కిలోర్, జస్టిస్ ప్రవీణ్ ఎస్ పాటిల్ ధర్మాసనం నిషాంత్ అగర్వాల్‌ను స్వేచ్ఛగా విడుదల చేయడమే కాక, ఆయనపై ఉన్న అన్ని తప్పులను కూడా తొలగించింది.ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన యువ శాస్త్రవేత్తకు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభం కానుంది.