Let's talk: editor@tmv.in
జీ7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి

జీ7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి

Venkatesh Balusula
14 సెప్టెంబర్, 2025

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకున్నారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఈ రెండు దేశాలపై సుంకాలు విధించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు జీ7 దేశాలకు కీలక సూచనలు చేశారు. ఆయా దేశాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా భారత్, చైనాలను లక్ష్యం చేసుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోల్లు చేపట్టే దేశాలపై అధిక సుంకాలు విధించాలని ట్రంప్ ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్, వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ జీ7 భాగస్వాములను తాము విధించిన సుంకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రష్యాకు ఆదాయ మార్గాలను అడ్డుకుంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడుతుందని వారు పేర్కొన్నారు. దీనికి ఆయా దేశాల నాయకులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

యుద్ధం ముగిసిన తర్వాత సుంకాల రద్దు

జీ7 సభ్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్తో పాటు అమెరికా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాన్స్ ఫిలిప్ షాంపెయిన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేటాయింపులు, వాణిజ్య చర్యలు, ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు నిలుపుకొన్న రష్యాకు చెందిన ఆస్తులను ఉక్రెయిన్ రక్షణ, పునర్నిర్మాణం కోసం ఎలా ఉపయోగించాలనే అంశాలపై చర్చించారు. జీ7 అధ్యక్ష పదవి బాధ్యతలు ప్రస్తుతం ఒట్టావా నిర్వహిస్తోంది. మాస్కోపై ఒత్తిడి పెంచడంలో సభ్య దేశాలు ఐక్యంగా ఉన్నాయని, ఉక్రెయిన్ దీర్ఘకాలిక ఆర్థిక పునరుద్ధరణను కాపాడాలని ఒట్టావా నొక్కి చెప్పింది. అమెరికా ప్రతినిధులు మాట్లాడుతూ రష్యా చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న చైనా, భారత్ల మీద అర్థవంతమైన సుంకాలు విధించాలన్నారు.

ఈ కొనుగోళ్లు పుతిన్ యుద్ధానికి ఆర్థికంగా సహకారం అందిస్తున్నాయని పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆ రెండు దేశాలపై సుంకాలు రద్దు చేయొచ్చని చెప్పారు. ట్రంప్ భారత్ దిగుమతులపై ఇప్పటికే 25 శాతం అదనపు సుంకాలు విధించారని, ప్రస్తుతం మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయని తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ఆపాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినా కానీ, భారత్, అమెరికా సంబంధాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సంక్లిష్టంగా మారుతున్నాయి. చైనా దిగుమతులపై కొత్త సుంకాలు విధించకపోవడానికి గల కారణాలు సైతం తెలిపారు.

యుద్ధం ఆపకపోతే మరిన్ని కఠిన చర్యలు

ఇటీవల ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్పై సుంకాలు విధించడం అంత సులభమైన పని కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. మాస్కో ఆదాయాలను తగ్గించడానికి ఇది తప్పనిసరిగా అవసరమని నొక్కి చెప్పారు. భారత్ రష్యాకు పెద్ద కొనుగోలు దారుగా ఉందని, ఈ కారణంగానే 50 శాతం సుంకాలు విధించామని చెప్పారు. పుతిన్ యుద్ధం ఆపకపోతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రష్యా బ్యాంకులు, చమురు ఎగుమతులపై విస్తృత ఆంక్షలు విధించేందుకు జీ7 దేశాల సహకారం అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతినిధులు త్వరలో చైనాతో వాణిజ్య ఒప్పందంపై చర్చించనున్నారు.

సుంకాలు అమలైతే పరిస్థితేంటి?

అమెరికా చర్యలు భారత్, చైనా ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. భారత్పై 50 శాతం సుంకాల వల్ల అమెరికా ఎగుమతులకు సమస్యగా మారింది. ఇది టెక్స్టైల్స్, ఫార్మా, ఐటీ సర్వీసెస్ వంటి రంగాల్లో ప్రభావం చూపుతోంది. భారత్, అమెరికా వాణిజ్య చర్చలు మరింత కష్టంగా మారనున్నాయి. రక్షణ, టెక్నాలజీ సహకారాలు ప్రభావితమవుతాయి. భారత్ దేశ అవసరాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోళ్లు చేస్తుంది. ఈ కొనుగోళ్లు ఆగితే ఇంధన ధరలు పెరిగి దేశ ఆర్థిక వృద్ధి మందగించవచ్చు. అప్పుడు భారత్ మళ్లీ మధ్య ప్రాచ్య, ఆఫ్రికా మార్కెట్ల వైపు వెళ్లాల్సి వస్తుంది.

అమెరికా చైనాపై నేరుగా సుంకాలు విధించకపోయినా, జీ7 దేశాల ఒత్తిడి వల్ల బీజింగ్ రష్యా చమురు కొనుగోళ్లు ఆపాల్సి రావొచ్చు. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అస్థిరతను తీసుకొస్తుంది, చమురు ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. రష్యా ఆదాయాలు తగ్గితే ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిసే అవకాశం ఉంది, కానీ, ఇది అమెరికా, రష్యా సంబంధాలను మరింత దిగజార్చవచ్చు. మొత్తంగా ఈ చర్యలు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెంచి, వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయని తెలుస్తోంది. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, అన్ని దేశాలతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ దేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.

జీ7 దేశాలపై ట్రంప్ ఒత్తిడి - Tholi Paluku