
697 బిలియన్ డాలర్లకు పెరిగిన ఫారెక్స్ నిల్వలు
భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారానికి దేశీయ ఫారెక్స్ నిల్వలు ఏకంగా 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.64.76 లక్షల కోట్లు) చేరుకున్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు వారం (మార్చి 27) నిల్వలు 10.288 బిలియన్ డాలర్ల మేర తగ్గి 688.058 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. తాజా పెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరట లభించినట్లయింది.
పశ్చిమాసియా సంక్షోభం.. రూపాయిపై ఒత్తిడి
ఈ ఏడాది ఫిబ్రవరి 27న భారత ఫారెక్స్ నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 728.494 బిలియన్ డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆ తర్వాత తలెత్తిన పశ్చిమాసియా సంక్షోభం కారణంగా నిల్వలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. యుద్ధ ప్రభావంతో రూపాయి విలువ పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుని డాలర్లను విక్రయించడం, కొన్ని కఠిన ఆర్థిక విధానాలను అనుసరించడం వల్ల నిల్వలపై ఒత్తిడి పెరిగింది.
పసిడి నిల్వల్లో భారీ పెరుగుదల
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. ఫారెక్స్ నిల్వల్లోని ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 1.784 బిలియన్ డాలర్లు పెరిగి 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. వీటిలో యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర కరెన్సీల విలువలో మార్పులు కూడా కలిసి ఉంటాయి. ఇకపోతే బంగారు నిల్వల విలువ ఒక్క వారంలోనే రికార్డు స్థాయిలో 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.
నిలకడగా ఇతర నిధులు
మిగిలిన విభాగాల్లో కూడా సానుకూల మార్పులే కనిపించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద ఉండే ప్రత్యేక నిధులు (ఎస్‌డీఆర్‌లు) మరో 58 మిలియన్ డాలర్లు పెరిగి 18.707 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే ఐఎంఎఫ్ వద్ద ఉండే మిగిలిన నిల్వలు మాత్రం 4.816 బిలియన్ డాలర్ల దగ్గరే స్థిరంగా ఉన్నాయి. రూపాయి విలువ పడిపోకుండా ఆర్బీఐ చేస్తున్న నిరంతర ప్రయత్నాల వల్ల, దేశ విదేశీ మారక నిల్వలు మళ్లీ 700 బిలియన్ డాలర్ల మార్కును తాకబోతుండటం ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమని నిపుణులు చెబుతున్నారు.
