Let's talk: editor@tmv.in
67 ఏళ్ల నిరీక్షణకు తెర.. రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ కాశ్మీర్‌

67 ఏళ్ల నిరీక్షణకు తెర.. రంజీ ట్రోఫీ ఫైనల్‌కు జమ్మూ కాశ్మీర్‌

Shaik Mohammad Shaffee
19 ఫిబ్రవరి, 2026

భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్రను లిఖించింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ఫైనల్లోకి సగర్వంగా దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బెంగాల్ జట్టును వారి సొంత గడ్డపైనే 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 1959-60 సీజన్‌లో రంజీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్.. 67 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తుది పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి.

షమీ రికార్డు ప్రదర్శన.. బెంగాల్‌కు స్వల్ప ఆధిక్యం

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ ఘరామీ (146) సెంచరీతో కదం తొక్కగా, అభిమన్యు ఈశ్వరన్ (49) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు పరిమితమైంది. అబ్దుల్ సమద్ (82), పరాస్ డోగ్రా (58) పోరాడినా.. టీమ్ ఇండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో జమ్మూ కాశ్మీర్ వెన్ను విరిచాడు. షమీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను (8/90) నమోదు చేసి బెంగాల్‌కు 26 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందించాడు.

పేకమేడలా కూలిన బెంగాల్ ఇన్నింగ్స్

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభించడంతో బెంగాల్ గెలుపుపై ధీమాగా ఉన్న తరుణంలో.. జమ్మూ కాశ్మీర్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ (4/36), సునీల్ కుమార్ (4/27) ధాటికి బెంగాల్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ హీరో ఘరామితో పాటు సుదీప్ ఛటర్జీ సున్నా పరుగులకే వెనుదిరిగారు. షాబాజ్ అహ్మద్ (24) మినహా ఎవరూ కనీస ప్రతిఘటన చూపకపోవడంతో బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది.

చరిత్ర సృష్టించిన సమద్, వన్షజ్ జోడి

కేవలం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ ఆరంభంలోనే తడబడింది. ఆకాశ్ దీప్ వరుస వికెట్లు తీయడంతో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే శుభమ్ పుందిర్ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా.. చివర్లో వన్షజ్ శర్మ (43 నాటౌట్), అబ్దుల్ సమద్ (30 నాటౌట్) అజేయమైన 55 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 34.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన జమ్మూ కాశ్మీర్ సంబరాల్లో మునిగిపోయింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ‘ఆకిబ్ నబీ’

మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసి బెంగాల్ పతనాన్ని శాసించిన పేసర్ ఆకిబ్ నబీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 2013-14 సీజన్లో తొలిసారి నాకౌట్ దశకు చేరుకున్న జమ్మూ కాశ్మీర్, ఇప్పుడు నేరుగా ఫైనల్ చేరి దేశం దృష్టిని ఆకర్షించింది. రాబోయే ఫైనల్ పోరులో కర్ణాటక లేదా ఉత్తరాఖండ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో జమ్మూ కాశ్మీర్ తలపడనుంది.