Let's talk: editor@tmv.in
సర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా 6.5 కోట్ల పేర్ల తొలగింపు: ఎంపీ అసదుద్దీన్

సర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా 6.5 కోట్ల పేర్ల తొలగింపు: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
4 జూన్, 2026

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్) ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఓట్ల తొలగింపు జరుగుతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ భారతదేశంలో ఓటు హక్కు లేని ఒక శాశ్వత వర్గాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఓవైసీ.. కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్ల ఆధారంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 6.5 కోట్ల మంది పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించిందని ఆరోపించారు. ఇప్పుడు ఆ తొలగింపులను అధ్యయనం చేయడానికి, అక్రమ వలసదారులను గుర్తించి, నిర్బంధించి, దేశం దాటించడానికి ఒక కమిటీని వేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. బలవంతులపై పేదవాడికి ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కు మాత్రమేనని, దాన్ని లాగేసుకుంటే ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఓటరు జాబితాల నుంచి పేర్లు తొలగించబడటం వల్ల ఇప్పటికే పలువురు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని కోల్పోతున్నట్లు నివేదికలు వస్తున్నాయని ఓవైసీ పేర్కొన్నారు.

చట్ట ప్రకారం ఓటరు జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన ఒక వ్యక్తి పౌరసత్వం కోల్పోయినట్లు కాదని ఓవైసీ స్పష్టం చేశారు. ఇంకా 27 లక్షల మంది ఓట్ల వ్యవహారం పరిశీలనలో ఉందని, చాలా మంది కొత్తగా ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, విదేశీయులు అనే కారణంతో ఎంతమందిని తొలగించారో కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడా స్పష్టమైన డేటాను ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియ ద్వారా తొలగించబడిన వారిలో ఎక్కువ మంది ముస్లింలు, మహిళలు, పేదలు, వలస కార్మికులే ఉన్నారని ఓవైసీ పేర్కొన్నారు. దేశంలో జనాభా ఇప్పటికే స్థిరపడిందని ప్రభుత్వ సొంత డేటా (టీఎఫ్ఆర్ 2.0) చెబుతున్నప్పుడు, ముస్లింలలో నిరంతరం భయాందోళనలు సృష్టించడానికే ఈ కమిటీని ప్రతిపాదిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

నీట్-యూజీ 2026 వివాదాలు, సీబీఎస్‌ఈ, ఓఎస్ఎమ్ విధానాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం భారతీయుల సమయాన్ని కేవైసీ, స‌ర్ వంటి డాక్యుమెంట్ల పేరుతో వృథా చేయడమే పనిగా పెట్టుకుంది. కానీ, ఒక సాధారణ పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో స‌ర్ షెడ్యూల్

ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దశలవారీగా స‌ర్ దశ-3 నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈ ప్రక్రియకు 2026 అక్టోబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించారు. జూన్ 15 నుంచి జూన్ 24 వరకు తయారీ దశ, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓల గృహ సందర్శనలు జరుగుతాయి. తుది ఓటరు జాబితా అక్టోబర్ 1, 2026న విడుదల చేయనున్నారు.