
6జి ప్రణాళికలపై ప్రధాని మోదీ… క్వాల్‌కామ్ సీఈఓ భేటీ
న్యూ ఢిల్లీలో జరిగిన ఒక ముఖ్యమైన భేటీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, క్వాల్‌కామ్ అధ్యక్షుడు, సీఈవో క్రిస్టియానో ఆమోన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశం కృత్రిమ మేధస్సు(ఏఐ), సెమీకండక్టర్ రంగం, 6జి సాంకేతికత, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి గురించి చర్చించారు. ప్రధాని మోదీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ , ఇండియా ఏఐ మిషన్‌లకు క్వాల్‌కామ్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు.. భారతదేశం అసమానమైన ప్రతిభా సంపద, అపార సామర్థ్యంతో ప్రపంచ సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలవగలదని ఆయన వ్యాఖ్యానించారు.
క్రిస్టియానో ఆమోన్, ఈ చర్చలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌తో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని తమ సంస్థ ఆసక్తి కలిగి ఉందని పేర్కొన్నారు. క్వాల్‌కామ్ భారత్ భాగస్వామ్యం ఇండియా ఏఐ మిషన్, సెమీకండక్టర్ మిషన్‌లను పటిష్ఠం చేయడమే కాకుండా, 6G సాంకేతికతలో భారత్ ముందడుగు వేయడానికి తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ గ్లాసెస్, ఆటోమొబైల్, పారిశ్రామిక రంగాలలో ఏఐ ఆధారిత సాంకేతికతల అభివృద్ధికి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన సూచించారు. అంతేకాకుండా తర్వాతి తరం సాంకేతికతల అభివృద్ధి, పరిశోధనలో భారత్‌తో కలిసి పనిచేయడానికి క్వాల్‌కామ్ నిబద్ధతతో ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఎక్స్ ఖాతాలో ట్వీట్ మోదీ మాటల్లో … క్రిస్టియానో ఆమోన్ తో భేటీ సంతోషకరం. భారత్‌లో ఏఐ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సాగుతున్న పురోగతిని చర్చించాం. సెమీకండక్టర్, ఏఐ మిషన్‌లకు క్వాల్‌కామ్ చూపిస్తున్న ఆసక్తి, సమర్పణ గౌరవనీయం. ప్రపంచ సాంకేతిక రంగంలో భవిష్యత్తును రూపొందించేందుకు భారత్ అసాధారణమైన ప్రతిభ , సామర్థ్యాన్ని కలిగి ఉంది అన్నారు.
భారత ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ , ఇండియా ఏఐ మిషన్ ద్వారా హైటెక్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమాలు ఏఐ పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతున్నాయి. క్వాల్‌కామ్‌తో భాగస్వామ్యం భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానం, విదేశీ పెట్టుబడులు, ఆవిష్కరణల వృద్ధికి ఊతం ఇవ్వనుంది. ఏఐ ఆధారిత పరికరాలు, 6జి సాంకేతికతల అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ చర్చలు భారత్‌ను గ్లోబల్ టెక్నాలజీ రంగంలో మరింత ప్రముఖ స్థానంలో నిలపనున్నాయి అని ఆశా భావం వ్యక్తం చేశారు.
