
53వ సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం
హిసార్ పట్టణం నుంచి ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు దూరం కేవలం 164 కి.మీ అయినా… ఆ ఉన్నత న్యాయ శిఖరం చేరుకునే ప్రయాణానికి 41 సంవత్సరాలు పట్టింది. సూర్యకాంత్ 1984లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. నాటి నుంచి నేడు 2025లో చీప్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎన్నో కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించే ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఓటర్ల జాబితా సవరణతో సహా అనేక చారిత్రాత్మక తీర్పులలో భాగమైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన దేవుడి పేరు మీద హిందీలో ప్రమాణం చేశారు. జస్టిస్ కాంత్ ఈ ఏడాది అక్టోబర్ 30న తదుపరి సీజేఐగా నియమితులయ్యారు. ఈ పదవిలో దాదాపు 15 నెలల పాటు ఉంటారు. ఫిబ్రవరి 9, 2027న పదవీ విరమణ చేస్తారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,మాజీ ప్రధాన న్యాయమూర్తి గవాయ్, న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ ఖడ్ కూడా హాజరయ్యారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త సీజేఐని అభినందించారు. ప్రమాణం అనంతరం జస్టిస్ సూర్యకాంత్ ప్రధాని మోడీకి అభివాదం చేశారు. అనంతరం ప్రధాని ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. భవిష్యత్తులో ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.కాంత్ ప్రమాణ స్వీకారం అనంతరం పూర్వ చీప్ జస్టిస్ గవాయ్ కాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల సుప్రీంకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, జడ్జీలు కార్యక్రమానికి హాజరై భారత న్యాయవ్యవస్థతో తమ అనుబంధాన్ని చాటుకున్నారు.
బాధ్యతల అనంతర తొలి మాటలు
సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఐదు కోట్లకు పైగా కేసుల పరిష్కారం, మధ్యవర్తిత్వాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం తన ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.
హిసార్ నుంచి సుప్రీం వరకు
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఫిబ్రవరి 10, 1962న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ కాంత్ ఒక చిన్న పట్టణం నుంచి దేశంలోని అత్యున్నత న్యాయ స్థానానికి చీప్ జస్టిస్ అయ్యేలా ఎదిగారు. పంజాబ్–హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా అనేక కీలక తీర్పులు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు.కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో 'ఫస్ట్ క్లాస్ ఫస్ట్'సాధించారు. అక్టోబర్ 5, 2018న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ముఖ్య తీర్పులు
• సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీకాలంలో ఆర్టికల్ 370 రద్దు, వాక్ స్వాతంత్య్రం, పౌరసత్వ హక్కులపై తీర్పు ఇచ్చారు.
• రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై ఇటీవల జరిగిన రాష్ట్రపతి సూచనలో భాగంగా ఉన్నారు.
• వలస రాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని తొలగించిన ధర్మాసనంలో ఈయన కూడా ఒకరు, ప్రభుత్వ సమీక్ష జరిగే వరకు దాని కింద కొత్త ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకూడదని ఆదేశించారు.
• బీహార్‌లో ఓటర్ల జాబితా ముసాయిదా జాబితా నుంచి మినహాయించబడిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని జస్టిస్ కాంత్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (ఎస్ఐఆర్) చేపట్టాలనే పోల్ ప్యానెల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించారు.
• అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం, లింగ సమానత్వం నొక్కి చెప్పే క్రమంలో, చట్టవిరుద్ధంగా పదవి నుంచి తొలగించబడిన మహిళా సర్పంచ్‌ను తిరిగి నియమించిన ధర్మాసనానికి ఆయన నాయకత్వం వహించారు.ఈ విషయంలో లింగ పక్షపాతాన్ని విమర్శించారు.
• సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని నిర్దేశించిన ఘనత కూడా ఈయనదే.
• 2022లో ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా ఉల్లంఘనపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని నియమించిన ధర్మాసనంలో జస్టిస్ కాంత్ ఒకరు.
• రక్షణ దళాలకు వన్ ర్యాంక్-వన్ పెన్షన్ పథకాన్ని కూడా ఆయన సమర్థించారు. ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. శాశ్వత కమిషన్‌లో సమానత్వం కోరుతూ సాయుధ దళాలలోని మహిళా అధికారుల పిటిషన్లను విచారిస్తూనే ఉన్నారు.
• 1967 అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ తీర్పును తిరస్కరించిన చారిత్రాత్మక ఏడు సభ్యుల బెంచ్‌లో భాగం. మైనారిటీ హోదా పునఃపరిశీలనకు మార్గం సుగమం.
పెగాసస్ కేసు
అనధికార గూఢచర్యంపై విచారణ కోసం సైబర్ నిపుణుల కమిటీని నియమిస్తూ‘జాతీయ భద్రత పేరిట ప్రభుత్వానికి ఫ్రీ పాస్ లేదు’ అని వ్యాఖ్యానించిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జాతీయ భద్రతా పరంగా చూడాల్సిన ప్రాజెక్టుగా పేర్కొంటూ చార్ ధామ్ ప్రాజెక్ట్‌కు నిర్మాణానికి అనుమతించారు.
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్—‘అతి స్వేచ్ఛా వేదిక కాదు’
రణవీర్ అలహాబాదియా కేసు
సామాజిక నిబంధనలను అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ హెచ్చరించారు. వీరు దివ్యాంగులపై హాస్యం చేసిన స్టాండప్ కమెడియన్లు. దీంతో ఆన్‌లైన్ కంటెంట్ మీద మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేశారు.
ఎంపీ, మంత్రుల వ్యాఖ్యలు
మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై—‘పదవిలో ఉన్నవారి మాటలకు బాధ్యత ఉండాలి’ అని కఠినంగా పేర్కొన్నారు.
అవినీతిపై కఠిన వైఖరి
బ్యాంకులు–డెవలపర్ల అవినీతి:
28 కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తూ అవినీతిని ‘సమాజానికి ప్రమాదకర వైరస్’గా అభివర్ణించారు.
కేజ్రీవాల్‌కి బెయిల్: సీబీఐ ‘కేజ్డ్ ప్యారట్’ అనే ముద్రను తొలగించుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.
అధికారిక వాహనం వదిలిన బీఆర్ గవాయ్
దేశ అత్యున్నత న్యాయవ్యవస్థలో సోమవారం అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్, తన పదవీకాలం ముగిసిన తర్వాత వ్యవస్థా మర్యాదలను పాటించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్టప్రతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీజేఐ అధికారిక మెర్సిడెస్ కారులో గవాయ్ చేరుకున్నారు. కార్యక్రమం పూర్తయ్యాక ఆ కారును కొత్త సీజేఐ సూర్యకాంత్ కోసం అక్కడే వదిలి, తన వ్యక్తిగత వాహనంలో తిరిగి ఇంటికి వెళ్లారు. ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త సీజేఐ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉండటంతో అధికారిక వాహనం అందుబాటులో ఉండేలా గవాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని న్యాయ వర్గాలు వెల్లడించాయి.
