Let's talk: editor@tmv.in
50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీ.. రిలయన్స్ భారీ పెట్టుబడి

50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీ.. రిలయన్స్ భారీ పెట్టుబడి

Shaik Mohammad Shaffee
12 మార్చి, 2026

భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రరాజ్యం అమెరికాలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. గత ఐదు దశాబ్దాలుగా అమెరికాలో కొత్తగా ఒక్క రిఫైనరీ కూడా ఏర్పాటు కాలేదు. అటువంటిది, ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్‌విల్ పోర్ట్ వద్ద నిర్మించ తలపెట్టిన భారీ రిఫైనరీలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ భాగస్వామి కానుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందమని, దీనివల్ల అమెరికా కార్మికులకు, ఇంధన రంగానికి భారీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభివర్ణించారు.

ఏమిటీ ప్రాజెక్టు? విశేషాలివే!

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్‌విల్‌లో 'అమెరికా ఫస్ట్ రిఫైనింగ్' అనే సంస్థ ఒక భారీ చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భారతదేశానికి చెందిన రిలయన్స్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా, రాబోయే 20 ఏళ్ల పాటు అక్కడ తయారయ్యే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంటు ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం అమెరికాలో దొరికే 'షెల్ ఆయిల్' ద్వారా రోజుకు సుమారు 1.60 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు 2026 మధ్యలో ప్రారంభం కానున్నాయి.

ఆర్థికంగా అతిపెద్ద అడుగు

ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న ప్రకారం.. ఇది 300 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 27 లక్షల కోట్లు) విలువైన భారీ డీల్. దీని ద్వారా అమెరికా వాణిజ్య లోటు గణనీయంగా తగ్గుతుందని అంచనా. ఈ ఒప్పందంలో భాగంగా 125 బిలియన్ డాలర్ల విలువైన 120 కోట్ల బ్యారెళ్ల అమెరికా షెల్ ఆయిల్ కొనుగోలు చేస్తారు. దీని నుంచి 175 బిలియన్ డాలర్ల విలువైన 5,000 కోట్ల గ్యాలన్ల శుద్ధి చేసిన ఉత్పత్తులను 'అమెరికా ఫస్ట్ రిఫైనింగ్' తయారు చేస్తుంది.

అమెరికా అవసరాలకు అనుగుణంగా..

ప్రస్తుతం అమెరికాలో 132 రిఫైనరీలు ఉన్నప్పటికీ, అవన్నీ పాతవి. అవి వెనిజులా, కెనడా వంటి దేశాల నుంచి వచ్చే భారీ క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేయడానికి రూపొందించబడ్డాయి. కానీ అమెరికాలో లభించేది తేలికపాటి షెల్ ఆయిల్. కొత్తగా రాబోతున్న ఈ రిఫైనరీ పూర్తిగా స్వదేశీ షెల్ ఆయిల్‌ను శుద్ధి చేసేలా అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్నారు.

రిలయన్స్‌కు కొత్తేమీ కాదు!

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నడుపుతున్న రిలయన్స్‌కు అమెరికాతో దశాబ్దాల అనుబంధం ఉంది. గతంలోనే అమెరికా షెల్ గ్యాస్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. ఫేస్‌బుక్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజాలు రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టగా, ఇప్పుడు రిలయన్స్ అమెరికా ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషించబోతోంది. తాజా ఒప్పందంతో అమెరికా నుంచి ముడి చమురును సేకరించడం, అక్కడ తయారైన ఇంధనాన్ని మార్కెట్ చేయడం రిలయన్స్‌కు మరింత సులభతరం కానుంది. "ఇది అమెరికా కార్మికులకు, ఇంధన రంగానికి దక్కిన భారీ విజయం. ఈ కొత్త రిఫైనరీ అమెరికా జాతీయ భద్రతను బలోపేతం చేస్తుంది" అని ఆ ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్) ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో, అమెరికా తన సొంత ఇంధన వనరులను వాడుకోవడానికి ఈ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారనుంది.

50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్త ఆయిల్ రిఫైనరీ.. రిలయన్స్ భారీ పెట్టుబడి - Tholi Paluku