Let's talk: editor@tmv.in
5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ రెడ్డి: కేటీఆర్

5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ రెడ్డి: కేటీఆర్

Gaddamidi Naveen
22 నవంబర్, 2025

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టీపీ ) పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ మండలాలుగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ విధానం, "భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి" దారి తీస్తుందని ఆయన ఆరోపించారు, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం ఆరోపణ

హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వేల కోట్లు విలువైన పరిశ్రమల భూములను రాజకీయంగా అనుబంధం ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అతి తక్కువ ధరలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు విక్రయం

కేటీఆర్ పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ విధానం ద్వారా బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఆజమ్‌బాద్ ప్రాంతాల్లోని మొత్తం 9,292 ఎకరాల పరిశ్రమల భూములు మల్టీ-యూజ్ జోన్‌గా మార్చబడే అవకాశం ఉందని. మార్కెట్ రేటు ఎకరాకు రూ. 40 నుంచి రూ. 50 కోట్లు ఉండగా, వాటిని పాత ఎస్ఆర్వో రేట్లలో కేవలం 30శాతంకే ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అనుమానాస్పదం, అవినీతికి సంకేతం అని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్ఆర్వో రేట్లు కూడా మార్కెట్ విలువ కంటే 4–5 రెట్లు తక్కువగా ఉన్నాయని ఆయ‌న‌ చెప్పారు.

హెచ్‌ఐఎల్‌టీపీ అమలులో పెట్టిన 7 రోజుల అప్లికేషన్ విండో, 7 రోజుల అనుమతి, 45 రోజుల్లో రెగ్యులరైజేషన్ వంటి త్వరిత ప్రక్రియల వెనుక పెద్దఎత్తున ముందుగానే చేసిన ఒప్పందాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రికి సన్నిహితులుగా చెప్పబడే వ్యక్తులు ఇప్పటికే భూ ఒప్పందాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.పరిశ్రమలకు కేటాయించిన భూములు మొదట రైతుల నుంచి స్వాధీనం చేసుకొని ఉపాధి సృష్టించేందుకు ఇచ్చినవేనని, అలాంటి భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వాడటం ప్రజాహితానికి విరుద్ధమని ఆయన హితవు పలికారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రతిపాదనలను తిరస్కరించినట్లు గుర్తు చేశారు.

కాంగ్రెస్ ఏటీఎం'గా అభివర్ణన

ఈ విధానాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా అభివర్ణించిన కేటీఆర్,గతంలో కూడా ముసీ నది తీరాలు, మెట్రో కారిడార్లు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం భూములతో ఇలాంటి ప్రయత్నాలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జల్సా కోసం భూములు అమ్ముకోవడం మాత్రమే దృష్టిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.రేవంత్ రెడ్డి యొక్క ఏకైక దృష్టి రియల్ ఎస్టేట్‌పైనే ఉంది, ఆయన చుట్టూ భూ డీలర్లు ఉన్నారు అని ఆయన విమర్శించారు.

భవిష్యత్తులో చర్యలు

పరిశ్రమలు, డెవలపర్లు ఈ విధానంలో భాగస్వామ్యం కాకూడదని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే ఈ ఒప్పందాలను రద్దు చేసి భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని, సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కేటీఆర్ చెప్పారు.విధానాన్ని ఉపసంహరించడమే కాకుండా, ప్రభుత్వానికి చెందిన భూముల్లో 50శాతంను పబ్లిక్ యూజ్‌కు కేటాయించి, మిగతావాటిని పారదర్శక వేలం ద్వారా అమ్మితేనే రాష్ట్రానికి సరైన ఆదాయం వస్తుందని కేటీఆర్ సూచించారు. బీజేపీ కూడా ఈ వ్యవహారంపై స్పందించి ప్రజల పక్షాన నిలవాలని ఆయన సవాల్ విసిరారు.

5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిన రేవంత్ రెడ్డి: కేటీఆర్ - Tholi Paluku