Let's talk: editor@tmv.in
5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు

5 కిలోల సిలిండర్ల కోటా రెట్టింపు

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలోని హర్ముజ్‌ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం మార్కెట్ ధరలతో అందించే 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల రోజువారీ కోటాను రెట్టింపు చేసింది. సరఫరాను స్థిరంగా ఉంచేందుకు తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సబ్సిడీతో అందించే 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్లకు భిన్నంగా, 5 కిలోల సిలిండర్లు మార్కెట్ ధరల్లో విక్రయిస్తారు. ఢిల్లీలో ప్రస్తుతం 5 కిలోల సిలిండర్ ధర రూ.549 కాగా, 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.913గా ఉంది. ఈ చిన్న సిలిండర్లు గుర్తింపు కార్డు చూపించి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నేరుగా కొనుగోలు చేయవచ్చు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్‌ 6న జారీ చేసిన లేఖ ద్వారా ప్రతి రాష్ట్రంలో వలస కార్మికులకు అందుబాటులో ఉండే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (ఎఫ్‌టీఎల్‌) సిలిండర్ల రోజువారీ సరఫరాను రెట్టింపు చేసినట్లు తెలిపారు.

ఫిబ్రవరిలో సుమారు 77 వేల 5 కిలోల సిలిండర్లు విక్రయించగా, మార్చి 2–3 తేదీల్లో అమ్మకాలు మరింత పెరిగినట్లు ఆమె తెలిపారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 7.8 లక్షల 5 కిలోల సిలిండర్లు విక్రయించారని చెప్పారు. సోమవారం ఒక్క రోజే 1.06 లక్షలకుపైగా సిలిండర్లు అమ్ముడైనట్లు వెల్లడించారు. ఇదే సమయంలో వాణిజ్య ఎల్పీజీ కేటాయింపును కూడా సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతం వరకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 4,300కుపైగా దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలని, దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గృహ వినియోగం, ఆస్పత్రులు వంటి కీలక రంగాలకు ఎల్పీజీ, పైప్‌డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రాధాన్యతగా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.