Let's talk: editor@tmv.in
తెలంగాణలో 47 శాతం యువత ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాభ్యాసం!

తెలంగాణలో 47 శాతం యువత ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాభ్యాసం!

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుల గణన 2024-25 నివేదికలు రాష్ట్రంలోని విద్య, సామాజిక స్థితిగతులపై ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించాయి. ముఖ్యంగా యువతలో ఆంగ్ల మాధ్యమ విద్య పట్ల పెరుగుతున్న మొగ్గు, అదే సమయంలో వివిధ కులాల మధ్య ఉన్న విద్యాపరమైన వ్యత్యాసాలను ఈ నివేదిక స్పష్టం చేసింది.

మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల బృందం ఈ సర్వే వివరాలను విశ్లేషించింది. రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల డేటాను పరిశీలిస్తే, 30 ఏళ్లలోపు యువతలో సగటున 47 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నట్లు నివేదిక పేర్కొంది.

విద్య, కులాల వారీగా వ్యత్యాసాలు

బ్రాహ్మణులు, కోమటి సామాజిక వర్గాల్లో అత్యధికంగా 72 శాతం మంది యువత ఆంగ్ల మాధ్యమంలో చదువుతుండగా, ఎస్టీ కోలాం తెగలో ఇది కేవలం 11 శాతానికే పరిమితమైంది. కులాల విద్యా స్థితిని అంచనా వేయడానికి రూపొందించిన “ఎడ్యుకేషన్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్” ప్రకారం.. విద్యాపరమైన వెనుకబాటుతనంలో ఓసీ జైన్ సామాజిక వర్గం అత్యున్నత స్థితిలో ఉండగా, బీసీ వడ్డెర కులం అత్యంత వెనుకబడి వర్గంగా ఉన్నారని ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ నివేదిక పేర్కొంది. విద్యా ప్రమాణాల్లో ఓసీ రెడ్డి సామాజిక వర్గం, బీసీ కేటగిరీలోని ఎస్సీ క్రైస్తవులు, కంసాలి కులాలతో సమానంగా ఉండటం గమనార్హం. ఎస్సీ మాలలు రాష్ట్ర సగటు అయిన 47 శాతానికి సమానంగా ఉండగా, మెజారిటీ ఎస్సీ, ఎస్టీ కులాలు సగటు కంటే తక్కువగా ఉన్నాయి.

ఆర్థిక కుటుంబ స్థితిగతులు

అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో ఆర్థిక అసురక్షితత అధికంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. వైద్య ఖర్చులు లేదా కుటుంబంలో వివాహాల వంటి అనుకోని వ్యయాల వల్ల అనేక కుటుంబాలు అప్పుల బారిన పడుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 1.1 కోట్ల మంది అత్యంత పేద ప్రజలలో (సంవత్సర ఆదాయం రూ. 1 లక్ష లోపు).. కేవలం నాలుగు కులాల నుంచే ఉన్నారని నివేదిక వెల్లడించింది. వాటిలో ఎస్సీ మాదిగలు, ఎస్టీ లంబాడాలు, బీసీ ముదిరాజ్‌లు, యాదవులే దాదాపు 40 శాతం మేర ఉండటం గమనార్హం.

రాష్ట్రంలో 25.1 శాతం కుటుంబాలకు మహిళలే యజమానులుగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఎస్సీలలో 27.9 శాతం ఉండగా, బీసీలలో 25.9 శాతం, ఎస్టీలలో 23.5 శాతం, ఓసీలలో 20.6 శాతం మహిళా ప్రాధాన్యత ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలు రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమాన విద్యావకాశాల కల్పనలో ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలకు దిక్సూచిగా మారనున్నాయి.