Let's talk: editor@tmv.in
తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టుల లొంగుబాటు

Gaddamidi Naveen
26 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మావోయిస్టు నిర్మూలనలో మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఒకేసారి 47 మంది అండర్‌గ్రౌండ్ సీపీఐ (మావోయిస్టు) క్యాడర్ సభ్యులు 32 మారణాయుధాలతో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.

కీలక నేతల లొంగుబాటు

లొంగిపోయిన వారిలో అత్యంత కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ హేమ్లా ఐతు అలియాస్ విజ్జా ఉన్నారు. వీరందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో పాటు, తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం, పోలీసుల సానుకూల దృక్పథానికి ఆకర్షితులై వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు డీజీపీ తెలిపారు.

లొంగిపోయిన వారితో పాటు స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక లైట్ మెషిన్ గన్ (ఎల్ఎంజీ), మూడు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు ఉన్నాయి. అంతేకాకుండా భూగర్భ పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే సుమారు 100 కిలోల కార్డెక్స్ వైర్ కూడా పట్టుబడింది.

మావోయిస్టు రహిత దిశగా..

తెలంగాణ ఇప్పటికే మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించబడగా, ఇప్పుడు దక్షిణ ఛత్తీస్‌గఢ్ కూడా దాదాపు మావోయిస్టు రహితంగా మారిందని డీజీపీ చెప్పారు. మార్చి 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 818 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. గత రెండు సంవత్సరాలలో 334 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 58 ఏకే-47లు, ఆరు ఎల్ఎంజీలు, అమెరికాకు చెందిన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయెల్ తయారీ టేవర్ సీక్యూబీ ఆయుధాలు ఉన్నాయి. ఈ విదేశీ ఆయుధాలు మావోయిస్టుల చేతికి ఎలా చేరాయన్న అంశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం నలుగురు అండర్‌గ్రౌండ్ కేడర్లు మాత్రమే ఇతర రాష్ట్రాలలో క్రియాశీలంగా ఉన్నారని తెలిపారు. 2023లో ఈ సంఖ్య 125గా ఉండటం గమనార్హం. ఆ నలుగురిలో ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, పాసనూరి నరహరి (సెంట్రల్ కమిటీ సభ్యులు), జాడె రత్నబాయి, వర్త శేఖర్ (స్టేట్ కమిటీ సభ్యులు) ఉన్నారు.

వీరందరూ ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలో చేరాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల సైనిక విభాగం పిఎల్జీఏ బెటాలియన్ ప్రస్తుతం అస్తిత్వాన్ని కోల్పోయిందని ఆయన వివరించారు. లొంగిపోయిన వారిని ద్రోహులుగా చిత్రీకరిస్తూ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చినట్లు చెబుతున్న లేఖల యదార్థతను పోలీసులు విచారిస్తున్నారు.