Let's talk: editor@tmv.in
42 శాతం రిజర్వేషన్లపై బీసీ నేతల సమ్మేళనం

42 శాతం రిజర్వేషన్లపై బీసీ నేతల సమ్మేళనం

Gaddamidi Naveen
11 అక్టోబర్, 2025

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ రిజర్వేషన్ల అంశంపై జరిగిన మీడియా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపు, ముఖ్యంగా 42 శాతం రిజర్వేషన్ అమలు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో కీలకమైన అంశమని తెలిపారు. బీసీ వర్గాలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురాకుండా ఎలాంటి స్థానిక ఎన్నికలు జరపకూడదని ఆయన పేర్కొన్నారు. బీసీ సమాజంలో దీని కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఒక పెద్ద సామాజిక ఉద్యమానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. అలాగే ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీలు తెలంగాణ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ, రాజకీయ హక్కుల్లో ఇంకా వెనుకబడి ఉన్నారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మాత్రమే బీసీ సమాజానికి నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే, బీసీ ఓటర్లు ఇక మౌనంగా ఉండరు అని హెచ్చరించారు. మాజీ స్పీకర్ మధుసూదన చారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో బీసీలు పోషించిన పాత్రను గుర్తుచేశారు. బీసీలు సామాజిక న్యాయం కోసం ఎల్లప్పుడూ ముందున్నారని, ఇప్పుడు వారికీ తగిన రాజకీయ న్యాయం దక్కాలని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన వరకు ఈ పోరాటం ఆగదన్నారు.

ఈ సమావేశంలో గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, పల్లె రవి, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. బీసీ నాయకులు ఐక్యంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు, ర్యాలీలు, నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచి, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఈ సమావేశం ద్వారా తీర్మానం చేశామని తెలిపారు.

42 శాతం రిజర్వేషన్లపై బీసీ నేతల సమ్మేళనం - Tholi Paluku