
41 పతకాలతో రికార్డు దిశగా భారత్
యూత్ ఏషియన్ గేమ్స్‌లో భారత యువ క్రీడాకారుల ధాటికి అడ్డుకట్ట లేదు. గురువారం బాక్సింగ్, బీచ్ రెజ్లింగ్‌లో ఆరు బంగారు, మూడు రజత పతకాలు సాధించి మరోసారి సత్తా చాటారు. దీంతో మొత్తం పతకాల సంఖ్య 41కి చేరింది. 12 బంగారు, 15 రజతం, 14 కాంస్యాలు. ఇటీవలి బహుళ క్రీడల పోటీల్లో ఇది భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
బాక్సింగ్ రింగ్‌లో భారత బాక్సర్లు నియంత్రణ, శక్తి, ప్రశాంతతలతో ఆకట్టుకున్నారు. 46 కేజీల్లో ఖుషీ చంద్ చైనా లూవో జిన్‌షియును 4-1తో చిత్తు చేసి బంగారు ప్రారంభం అందించింది. తీక్ష్ణమైన కౌంటర్ దాడులు, చురుకైన అడుగులతో ఆధిపత్యం చూపింది. 50 కేజీల్లో అహానా శర్మ ఉత్తర కొరియా మా జాంగ్ హ్యాంగ్‌ను మొదటి రౌండ్‌లోనే ఆర్‌ఎస్‌సీతో ఓడించి బలమైన ఆటను చూపించింది.
మహిళల బాక్సర్ల హ్యాట్రిక్‌ను పూర్తి చేస్తూ 54 కేజీల్లో భోరేషి పూజారి ఉజ్బెకిస్తాన్ ముహమ్మదోవా కుమ్రినిసోను 5-0తో సునాయసంగా మట్టికరిపించింది. అయితే అబ్బాయిల 50 కేజీల్లో లంచెన్‌బా సింగ్ మోయిబుంగ్‌ఖోంగ్‌బామ్ కజకిస్తాన్ నూర్‌మఖాన్ జుమగలీకి గట్టి పోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.
సాయంత్రం సెషన్‌లో 66 కేజీల హర్నూర్ కౌర్, 80 కేజీల అంశికలు బంగారు పతకం పోరాటాలకు సిద్ధమవుతున్నారు. బాక్సింగ్‌లో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బీచ్ రెజ్లర్లు కూడా బాక్సర్లకు ఏమాత్రం తగ్గకుండా మూడు బంగారు, రెండు రజతాలు సాధించారు. అబ్బాయిల 60 కేజీల్లో సాని సుభాష్ ఫుల్‌మాలి ఇరాన్ అమీరలీ డొమిర్‌కోలాయిని 2-0తో, అమ్మాయిల 55 కేజీల్లో అంజలి వియత్నాం బుయి గాక్ థావో థామ్‌ను 2-1తో, అబ్బాయిల 90 కేజీల్లో అర్జున్ రుహిల్ ఇరాన్ మొహమ్మద్‌మహ్దీ ఫౌతూహిని ఆధిపత్యంతో ఓడించి బంగారు పతకాలు గెలుచుకున్నారు.
70 కేజీల్లో సుజయ్ నాగనాథ్ తాన్‌పురే, 80 కేజీల్లో రవీందర్ ఇరాన్ సీనా షోకూహి, తౌరాజ్ ఖొదాయీలకు 1-2తో ఓడి రజతాలతో సంతృప్తి పడ్డారు. వివిధ క్రీడల్లో భారత యువతలు రాణిస్తుండటంతో జట్టు ఉత్సాహంగా ఉంది. మరిన్ని ఫైనల్స్ ముందుండటంతో బహ్రైన్ గేమ్స్‌లో రికార్డు పతకాల సాధనకు ఆశలు పెరిగాయి.
