
400 ఏళ్ల బారాపుల్లా వంతెన పునరుద్ధరణ పూర్తి
దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిన 400 ఏళ్ల పురాతన బారాపుల్లా బ్రిడ్జ్ వంతెనను భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) పునరుద్ధరించింది. రెండు దశల్లో చేపట్టిన పనులు పూర్తయ్యాయని బుధవారం అధికారులు తెలిపారు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ సమీపంలో, బారాపుల్లా ఫ్లైఓవర్ కింద ఉన్న ఈ మొఘల్ కాలపు నిర్మాణం ప్రస్తుతం తన అసలు రూపాన్ని తిరిగి పొందిందని ఏఎస్ఐ ఢిల్లీ సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ తెలిపారు. 2025 జనవరిలో మలినాల తొలగింపుతో మొదలైన పనులు, నిర్మాణ పునరుద్ధరణతో 2026 ఫిబ్రవరిలో పూర్తయ్యాయి.
పునరుద్ధరణకు ముందు వంతెన చుట్టూ ఆక్రమణలు విస్తరించాయి. దారి భాగం తాత్కాలిక మార్కెట్‌గా మారగా, దాని కిందుగా ప్రవహించే డ్రెయిన్ మురుగు నీటితో నిండిపోయింది. పునరుద్ధరణలో భాగంగా బిటుమెన్ పొరలను తొలగించి అసలు రాయి నిర్మాణాన్ని బయటపెట్టారు. వంతెన పేరుకి కారణమైన 12 స్తంభాలను మరమ్మతు చేయగా, కొంత భాగంలో కొత్తగా నిర్మించారు. ఆక్రమణలను తొలగించి వంతెనకు రక్షణగా ఇనుప గ్రిల్లులు, గేట్లు ఏర్పాటు చేశారు. నిర్మాణ పరిరక్షణ కోసం పక్క భాగాల్లో గడ్డి నాటారు. ప్రస్తుతం వంతెనను సందర్శకులకు పరిమితంగా అందుబాటులో ఉంచారు.
చారిత్రకంగా ఈ వంతెన మొఘల్ కాలంలో యమునా దాటి ముఖ్య ప్రదేశాలకు వెళ్లే మార్గంగా ఉపయోగించారు. నిజాముద్దీన్ దర్గా, హుమాయూన్ సమాధి వంటి ప్రాంతాలకు చేరుకునేందుకు ఇది కీలకంగా ఉండేది. 1621-22 కాలంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ పాలనలో ఈ వంతెన నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆధునిక నగర నిర్మాణాల మధ్య ఈ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఢిల్లీ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
