
4వ EMRS నేషనల్ స్పోర్ట్స్ మీట్‌లో చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యార్థులు అభినందించిన సీఎం
4వ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025 లో తెలంగాణ విద్యార్థులు అద్భుత ప్రతిభ ప్రదర్శించి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విజేతలను కలిసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, వారి కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ యువ క్రీడాకారులు అన్ని రాష్ట్రాలను అధిగమిస్తూ మొత్తం 230 పతకాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమైందని సీఎం పేర్కొన్నారు. ఒడిశాలోని రూర్కేలాలో నవంబర్ 11 నుంచి 15 వరకు జరిగిన ఈఎంఆర్ఎస్ స్పోర్ట్స్ మీట్ 2025 లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ వంటి విభాగాల్లో తమ ప్రతిభను చాటుతూ తెలంగాణ విద్యార్థులు అత్యధిక పతకాలను సాధించడం తెలంగాణకు గర్వకారణం అని సీఎం అన్నారు.
ఈ విజయం విద్యార్థుల పట్టుదల, శిక్షణ, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.వారు విజేత విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.తెలంగాణ యువత 4వ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్–2025 లో 230 పతకాలు సాధించింది, అవి: 88 బంగారు, 66 వెండి, 76 కాంస్య పతకాలు సాధించారు.
ఈఎంఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ స్థాయి క్రీడాపోటీలు, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులకు తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప వేదికగా నిలిచాయి.
